Jaggery winter benefits: మన లైఫ్‌స్టైల్ ఎంత మోడ్రన్‌గా మారినా, కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ విలువ ఎప్పటికీ తగ్గదు. వాటిలో బెల్లం ఒకటి. పంచదారకు బదులుగా నేచురల్ ఆప్షన్‌గా ఇప్పుడు చాలా మంది బెల్లం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం లేదా నువ్వుల లడ్డు, వేరుశనగ చెక్కీ లాంటి స్వీట్స్ తినడం మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. దీని వెనక మంచి హెల్త్ రీజన్స్ కూడా ఉన్నాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతూ ఉంటారు.
చలికాలంలో మన శరీర టెంపరేచర్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి శరీరం ఎనర్జీని ఎక్కువగా వాడుకుంటుంది. ఈ సీజన్‌లో బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందడంతో పాటు, వెచ్చదనం కలిగే.. ఫీలింగ్ వస్తుంది. ఇందులో ఉండే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ డైలీ న్యూట్రిషన్‌కు కొంత సపోర్ట్ ఇస్తాయి. ముఖ్యంగా.. భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే.. జీర్ణ ప్రక్రియ స్మూత్‌గా ఉండటానికి, గ్యాస్ లేదా మలబద్ధకం లాంటి చిన్నపాటి ఇబ్బందులు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే చలికాలంలో.. గాలిలో కాలుష్యం పెరిగే టైమ్‌లో, రెస్పిరేటరీ సిస్టమ్‌కు కొంత ఊరట నిచ్చే ఆహారంగా కూడా దీన్ని పరిగణిస్తూ ఉంటారు.
ఇక వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్క్ మధ్య సాయంత్రం టైమ్‌లో తీపి తినాలనిపిస్తే.. ప్రాసెస్డ్ స్వీట్స్, చాక్లెట్ల కంటే బెల్లంతో చేసిన స్నాక్స్ ఒక స్మార్ట్ స్వైప్ లాంటివి. బెల్లం, వేరశనగ లేదా నువ్వులు కలిపి తింటే రుచికి రుచి, కొంత ఎనర్జీ కూడా లభిస్తుంది. అందుకే ఫిట్‌నెస్, వెల్‌నెస్ గురించి ఆలోచించేవాళ్లు కూడా మితంగా బెల్లం వాడటానికి ఇష్టపడుతుంటారు.
అయితే.. బెల్లం నేచురల్ కదా అని ఇష్టమొచ్చినంత తినేయడం మాత్రం పెద్ద పొరపాటు అవుతుంది. ఇక్కడే మనం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. బెల్లంలో కూడా క్యాలరీలు, షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటాయి. “నేచురల్ షుగర్ కదా, ఎంత తిన్నా పర్వాలేదు” అనుకుంటే.. వెయిట్ మేనేజ్‌మెంట్ కష్టంగా మారొచ్చు. రోజూ ఎక్కువ మొత్తంలో తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ లేదా బరువు నియంత్రణలో ఉండాలనుకునే వాళ్లు బెల్లం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.
Also Read: ఆకుకూర తినని వాళ్ళు కూడా..ఇష్టపడే పాలకూర పచ్చడి
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. క్వాలిటీ. మార్కెట్‌లో దొరికే అన్ని బెల్లాలు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు రంగు కోసం, త్వరగా గట్టిపడటం కోసం కెమికల్స్ వాడిన బెల్లం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరీ తెల్లగా లేదా అతిగా మెరుస్తూ ఉండే బెల్లం కంటే, సహజ మైన లేత గోధుమ లేదా ముదురు రంగులో.. ఉండే నాణ్యమైన బెల్లాన్ని ఎంచుకోవడం బెటర్. అలాగే ఫ్రిజ్‌లో లేదా తేమ ఉన్న చోట పెడితే బెల్లం మెత్త బడి, ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనిన గాలి చొరబడని డబ్బాలో పొడిగా ఉండేలా స్టోర్ చేసుకోవాలి.
ఏ ఆహారమైనా బ్యాలెన్స్‌డ్ డైట్‌లో ఒక భాగంగానే ఉండాలి. కేవలం బెల్లం తినడం వల్ల ఏ జబ్బూ పూర్తిగా నయం చేయదు, లేదా ఏ మ్యాజిక్ జరగదు. రోజూ సరిపడా నీళ్లు తాగడం, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, తగినంత నిద్ర, యాక్టివ్‌గా ఉండటం వంటి అలవాట్లతో పాటు దీన్ని ఒక చిన్న భాగంలా మాత్రమే చూడాలి.
మొత్తంగా చెప్పాలంటే, చలికాలంలో బెల్లం తినడం వల్ల ఎనర్జీ, డైజెషన్ సపోర్ట్ వంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ క్వాంటిటీ కంట్రోల్, క్వాలిటీ చెక్ మాత్రం అస్సలు మర్చి పోకూడదు.