Cheesy Chicken Pasta Recipe: పాస్తా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అందులోనూ చికెన్ ముక్కలు, కమ్మని చీజ్ కలిపి తయారుచేస్తే ఆ రుచే వేరు. రెస్టారెంట్‌లో దొరికే రుచికరమైన చీజ్ చికెన్ పాస్తాను మన ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్‌గా, పిల్లలకు లంచ్ బాక్స్‌లో పెట్టడానికి లేదా వీకెండ్ స్పెషల్‌గా చేసుకోవడానికి ఇది మంచి ఎంపిక. పాస్తా మెత్తగా ఉడికి, చికెన్ ముక్కలకు మసాలాల రుచి పట్టి, పైన చీజ్ కరిగి కలిసిపోతే తినకుండా ఉండలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎంతో రుచిగా ఉండే చీజ్ చికెన్ పాస్తాను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూసేద్దాం రండి..
పాస్తా – 2 కప్పులు
బోన్‌లెస్ చికెన్ – 200 గ్రాములు
ఉల్లిపాయ – 1
టమోటా – 1
పచ్చిమిర్చి – 2
వెల్లుల్లి – 5 రెబ్బలు
మిరియాల పొడి – అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ – 1 టీస్పూన్
మిక్స్‌డ్ హెర్బ్స్ – అర టీస్పూన్
చీజ్ – అర కప్పు
పాలు – అర కప్పు
ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు
వెన్న – 2 టేబుల్ స్పూన్లు
నూనె – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
Also Read: చక్కెర, బెల్లం లేకుండా కమ్మని పెసరపప్పు డ్రై ఫ్రూట్ లడ్డూ.. డైట్ చేసేవారికి బెస్ట్ స్వీట్!
ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి మరిగించాలి. అందులో పాస్తా వేసి మెత్తగా ఉడికించాలి. పాస్తా ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. స్టవ్‌పై పాన్ పెట్టి వెన్న, నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యాక చికెన్ ముక్కలు వేసి బాగా ఉడికించాలి.
తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్, మిక్స్‌డ్ హెర్బ్స్, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి తక్కువ మంటపై మరిగించాలి.
ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసి సాస్ అంతా పట్టేలా బాగా కలపాలి. చివరగా తురిమిన చీజ్ వేసి అది కరిగి పాస్తాకు చక్కగా పట్టే వరకు కలపాలి. పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.
Also Read: అల్లం ఎండిపోకుండా నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి!