KFC Style Chicken Fries: బయట దొరికే క్రిస్పీ చికెన్ తినాలనిపించినప్పుడల్లా రెస్టారెంట్‌కు వెళ్లాల్సిన పనేం లేదు. మన ఇంట్లో ఉండే కొన్ని మసాలాలతోనే అచ్చం అలాంటి రుచితో చికెన్ ఫ్రైస్ను అదిరిపోయేలా చేసుకోవచ్చు. పైన కరకరలాడే పొర, లోపల మెత్తగా ఉడికిన చికెన్ ఈ వంటకం అసలైన స్పెషల్. చికెన్‌ను ముందుగా మసాలాల్లో బాగా మ్యారినేట్ చేసి, పిండితో రెండుసార్లు కోట్ చేస్తే చాలు.. ఆ కరకరలాడే పొర అద్భుతంగా వస్తుంది. ఇప్పుడీ చికెన్ ఫ్రైస్ను ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం..
బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు
మైదా – ఒక కప్పు
కార్న్‌ఫ్లోర్ – అర కప్పు
గుడ్డు – ఒకటి
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్
కారం – ఒక టీ స్పూన్
మిరియాల పొడి – అర టీ స్పూన్
ఉప్పు – తగినంత
వెల్లుల్లి పొడి – అర టీ స్పూన్
ఒరేగానో లేదా మిక్స్డ్ హెర్బ్స్ – అర టీ స్పూన్
నూనె – వేయించడానికి సరిపడా.
Also Read: వెల్లుల్లి పచ్చడి తిన్నా నోరు వాసన రాకూడదా? 99% మందికి తెలియని సీక్రెట్ టిప్ ఇదే!
శుభ్రంగా కడిగిన చికెన్‌ను ఒక గిన్నెలో వేసి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, మిరియాల పొడి, ఉప్పు కలిపి బాగా పట్టించాలి. ఈ మిశ్రమం ప్రతి ముక్కకు పట్టేలా కలిపి కనీసం గంట నుంచి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
మరో గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, ఒరేగానో వేసి కలపాలి. ఇంకో గిన్నెలో గుడ్డును బాగా గిలకొట్టాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కను ముందుగా గుడ్డులో ముంచి, తర్వాత పిండి మిశ్రమంలో దొర్లించాలి. మరింత కరకరలాడే పొర కావాలంటే మళ్లీ గుడ్డులో ముంచి పిండిలో కోట్ చేయాలి.
బాణలిలో నూనె వేడి చేసి మంటను మీడియంగా ఉంచాలి. నూనె మరీ వేడెక్కిన తర్వాత వేయిస్తే బయట త్వరగా రంగు మారి లోపల చికెన్ సరిగా ఉడకకపోవచ్చు. అందుకే నూనె వేడిని గమనిస్తూ ముక్కలను కొద్దికొద్దిగా వేయాలి. బంగారు రంగు వచ్చి చికెన్ పూర్తిగా ఉడికే వరకు వేయించాలి. ఎక్కువ ముక్కలు ఒకేసారి వేయకూడదు.
వేయించిన చికెన్‌ను పేపర్ టవల్‌పై కాకుండా వీలైతే వైర్ ర్యాక్‌పై పెట్టాలి. ఇలా చేస్తే కింద తేమ చేరకుండా క్రిస్పీగా ఉంటుంది. రెండు నిమిషాలు ఆగిన తర్వాత టమాటో సాస్ లేదా మయోనైస్‌తో వేడివేడిగా వడ్డించుకోవచ్చు.
ముక్కలు పెద్దగా ఉంటే ఉడకడానికి సమయం పడుతుంది కాబట్టి.. ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ప్రతి బ్యాచ్ మధ్య నూనె మళ్లీ వేడెక్కనివ్వాలి. ఇలా చేస్తే చికెన్‌లోని రసం నిలిచి, ప్రతి ముక్క రుచిగా ఉంటుంది.
Also Read: మఖానా తింటే లాభమే కాదు నష్టం కూడా ఉంది.. ఈ 5 రకాల సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా తినొద్దు!