Split Ends: జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య వెంట్రుకల చివరలు చిట్లిపోవడం. ఈ సమస్య జుట్టు.. సహజమైన మెరుపును తగ్గిస్తుంది. అంతే కాకుండా నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. అసలు ఈ స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు వస్తాయి ? వీటిని శాశ్వతంగా ఎలా తొలగించాలి అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ప్లిట్ ఎండ్స్ అంటే ఏమిటి ?
స్ప్లిట్ ఎండ్స్ అంటే వెంట్రుకల చివరలు రెండుగా లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా చీలిపోవడం. దీనికి ప్రధాన కారణం జుట్టు బలహీనపడటం. మన జుట్టు ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. జుట్టు చిట్లిపోవడానికి ప్రధాన కారణాలు కూడా ఉంటాయి.
వేడిని ఉపయోగించడం: హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు, కర్లింగ్ ఐరన్స్ వంటి వాటిని తరచుగా వాడటం వల్ల జుట్టు పొడిబారి, బలహీనపడుతుంది.
కెమికల్ ట్రీట్‌మెంట్స్: హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, పర్మినెంట్ స్ట్రెయిటనింగ్ వంటి రసాయన ప్రక్రియలు జుట్టు సహజ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి.
తప్పుగా దువ్వడం: తడి జుట్టును గట్టిగా దువ్వడం, ప్లాస్టిక్ బ్రష్‌లను వాడటం వల్ల జుట్టు చివరలు దెబ్బతింటాయి.
వాతావరణం: పొడి వాతావరణం, సూర్యరశ్మి, కాలుష్యం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
స్ప్లిట్ ఎండ్స్‌ను శాశ్వతంగా తొలగించడం సాధ్యమా ?
ఒకసారి చిట్లిపోయిన వెంట్రుకలను ఎలాంటి క్రీమ్ లేదా షాంపూలను వాడినా తిరిగి రిపేర్ చేయడం సాధ్యం కాదు. స్ప్లిట్ ఎండ్స్ సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే వాటిని కత్తిరించడం. అందుకే జుట్టు చివరలను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది సమస్యను తాత్కాలికంగా కాకుండా.. భవిష్యత్తులో రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
జుట్టును కత్తిరించడం వల్ల దాని పొడవు తగ్గిపోతుందని చాలామంది భయపడతారు. కానీ. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే, దెబ్బతిన్న చివరలను తొలగించడం చాలా అవసరం. ప్రతి 6-8 వారాలకు ఒకసారి అర అంగుళం జుట్టును ట్రిమ్ చేయించుకుంటే.. స్ప్లిట్ ఎండ్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
స్ప్లిట్ ఎండ్స్‌ను నివారించడానికి చిట్కాలు:
స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చూసుకోవడమే వాటిని శాశ్వతంగా నివారించడానికి ఉత్తమ మార్గం. దీని కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు..
హెయిర్ ట్రిమ్మింగ్: ప్రతి 6-8 వారాలకు ఒకసారి జుట్టు చివరలను ట్రిమ్ చేయించుకోండి.
వేడి పరికరాల వాడకాన్ని తగ్గించండి: హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లకు బదులుగా.. సహజ పద్ధతుల్లో జుట్టును ఆరనివ్వండి. తప్పనిసరిగా వాడాల్సి వస్తే.. ముందుగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే ఉపయోగించండి.
Also Read: స్కిన్ అలెర్జీకి కారణాలివేనట !
సరైన షాంపూ, కండిషనర్: మీ జుట్టు రకానికి సరిపోయే షాంపూ, కండిషనర్‌ను ఉపయోగించండి. కండిషనర్ జుట్టు చివరలను మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.
తడి జుట్టును దువ్వకూడదు: తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. దాన్ని దువ్వడం మానుకోండి. ఒకవేళ దువ్వాల్సి వస్తే.. వెడల్పాటి పళ్ల దువ్వెన ఉపయోగించండి.
కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె: వారానికి ఒకసారి తలకి నూనె మసాజ్ చేసుకోండి. ఇది జుట్టుకు పోషణ అందిస్తుంది.
సరియైన పోషకాహారం: ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.