Telangana Politics: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తనుకు దైవ సమానులు అని చెప్పుకునే కేసీఆర్‌కే ఎదురు వెళ్లబోతున్నారా..? ఇన్నాళ్లు తన రాజకీయ గురువు అని చెప్పుకునే కేసీఆర్ పైనే తిరుగుబాటు చేయబోతున్నారా..? అంటే అవుననే సందేహలు వ్యక్తమవుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం.. కవిత ఈ నెల చివరన చేపట్టబోతున్న రాష్ట్రవ్యాప్త పర్యటనల పోస్టర్‌లో కేసీఆర్ ఫోటో ఉండదనే వార్తలు వినిపిస్తుండటమే. ఇన్నాళ్లు జాగృతి రాష్ట్ర కార్యాలయంలో కేసీఆర్ , జయశంకర్ ఫొటోలు ఉండేవి. అయితే ఇప్పటి నుంచి కేసీఆర్ ఫోటోను దూరం పెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది న్యూస్.
కవిత ఈ నెల చివరలో రాష్ట్ర వ్యాప్త చేపట్టబోయే యాత్రకు రూపొందించిన వాల్ పోస్టర్‌లో కేసీఆర్ ఫొటోకు స్థానం కల్పించలేదని సమాచారం. ఒక్కసారిగా కేసీఆర్ ఫొటోను తొలగించడం వెనుక ఆంతర్యమేంటనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం… తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా, పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించకపోవడమా? లేకుంటే ప్రత్యర్థులకు విమర్శల అవకాశం ఇవ్వకుండా పక్కా ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారంతో కవిత మరింత యాక్టీవ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే తొలుత కేసీఆర్ ఫొటో ను జాగృతి కార్యక్రమాలకు దూరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తను స్వతహాగా ఎదిగేందుకు.. రాజకీయాల్లో తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నట్లుగా కవిత ప్రణాళికలు కనిపిస్తున్నాయి.
జాగృతి సంస్థ బలోపేతంలో భాగంగానే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల చివరి వారం నుంచి పర్యటలకు ప్లాన్ చేశారు. ప్రతి జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మేధావులు, కవులు, కళాకారులు, నిరుద్యోగులు, యువత, మహిళా, విశ్రాంత ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో భేటి అయ్యి సమస్యను తెలుసుకోబుతున్నట్లు సమాచారం.
కవిత నిజామాబాద్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడి నుంచే 2014 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2020లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నికయ్యారు. రెండోసారి అక్కడి నుంచే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లాల యాత్రను నిజామాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ లో యాత్ర ముగింపు సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ యాత్ర మొత్తం 4 నెలల పాటు సాగనున్నట్లు సమాచారం.
Also Read: హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసిన పోలీస్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ను సిద్ధం చేస్తున్నారు కవిత. క్షేత్రస్థాయి వరకు జాగృతిని బలోపేతం చేసేందుకు ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ కమిటీలు వేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాగృతితో పాటు అనుంబంధ సంఘాల కమిటీలు వేయబోతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను జాగృతి చేయడం, జాగృతి కార్యకలాపాలను తెలియజేస్తూ వారిని యాక్టీవ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.