Satyaraj: బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర ద్వారా పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నాడు కోలీవుడ్ నటుడు సత్యరాజ్. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సత్యరాజ్ ఈ మధ్య రిలీజ్ అయిన కూలీ సినిమాలో నటించి మెప్పించాడు. అయితే రజినీకాంత్ సినిమాలో తాను నటించనని 18 ఏళ్ళ క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
శివాజీ సినిమాలో సుమన్ పాత్ర మొదట సత్యరాజ్ వద్దకు వెళ్లగా.. ఆయన నిరాకరించాడు. శంకరే స్వయంగా అడిగినా కూడా సత్యరాజ్.. తాము ఎంత కష్టపడి నటించినా రజినీ తన స్టైల్ తో సినిమా మొత్తాన్ని తనవైపుకు తిప్పేసుకుంటాడు. అందరూ ఆయనకే ఆకర్షితులవుతారు. అందుకే రజినీ సినిమాలు ఇకనుంచి చేయను అని సత్యరాజ్ తెగేసి చెప్పాడు. దీంతో అప్పట్లో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి.
అయితే అప్పటి వివాదానికి సత్యరాజ్ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అప్పట్లో నేను అన్నాను అన్న వ్యాఖ్యలు అన్ని అవాస్తవమని, తాను ఏరోజు అలా మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. శివాజీ సినిమాను రిజెక్ట్ చేయడానికి తనకు పెద్ద కారణమే ఉందని చెప్పుకొచ్చాడు. ” శివాజీ సినిమా చేసే సమయంలోనే నేను హీరోగా నిలదొక్కుకుంటున్నాను. అప్పుడే శంకర్ వచ్చి విలన్ రోల్ ఆఫర్ చేశాడు. అప్పుడు ఆ పాత్రను ఒప్పుకున్నాను అంటే.. ఆ తరువాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని భయపడ్డాను. అందుకే ఆ పాత్రను వదులుకున్నాను. కానీ, మీడియాలో నా గురించి ఏవేవో రాసారు. అందులో ఎలాంటి నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.
కెరీర్ మొదట్లో సత్యరాజ్, రజినీకాంత్ కు తండ్రిగా నటించాడు. ఆ సినిమానే మిస్టర్ భరత్. 1986 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వయస్సు తక్కువ అయినా కూడా సత్యరాజ్.. రజినీకి తండ్రిగా నటించాడు. ఈ సినిమా తరువాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. ఇక మిస్టర్ భరత్ తరువాత అంటే దాదాపు 38 ఏళ్ల అనంతరం వీరిద్దరూ కలిసి కూలీ సినిమాలో కలిసి నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీ – సత్యరాజ్ ఫ్రెండ్స్ గా కనిపించారు. మరి ముందు ముందు వీరిద్దరూ కలిసి నటిస్తారో లేదో చూడాలి.