కోడి గుడ్డు మన చర్మ సంరక్షణకు చేసే మేలు ఎంతో. కోడిగుడ్డును ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. కోడి గుడ్డులోని తెల్ల సొన జుట్టు, చర్మం కలవారికి ఎంతో ఉపయోగపడుతుంది. అది చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
గుడ్డును ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
గుడ్డులోని తెల్ల సొనలో ఆస్ట్రిజంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. జిడ్డు పట్టడాన్ని తగ్గిస్తాయి. రంధ్రాలను చిన్నగా చేసి చర్మానికి మృదువైన రూపాన్ని ఇస్తాయి. అలాగే అల్బుమిన్ వంటి ప్రోటీన్లను కూడా ఇది కలిగి ఉంటుంది. కాబట్టి చర్మాన్ని మృదువుగా టోన్ చేస్తుంది. అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. మొటిమలకు గురయ్యే వారు అప్పుడప్పుడు గుడ్డులోని తెల్ల సొనను ముఖానికి అప్లై చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
2018లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం గుడ్డులోని తెల్ల సొనలో ఉండే ప్రోటీన్లు కణజాలాల మరమ్మత్తును ప్రోత్సహిస్తాయని నిరూపించింది. చర్మ వైద్యంలో గుడ్డు ఎంతగానో సహాయపడుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చాయి.
పచ్చసొనతో ఉపయోగాలు
గుడ్డులోని పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, జింక్ వంటి కణజాలు అధికంగా ఉంటాయి. ఇది పొడి లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్డులోని పచ్చ సొనను డ్రై స్కిన్ ఉన్నవారు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు అప్లై చేసుకుంటే వారి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పచ్చసొనలో కొవ్వులు తేమను నిలపడంలో సహాయపడతాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా తాజాగా కనిపిస్తుంది.
గుడ్లలో చర్మ ఆరోగ్యానికి అవసరమైన బయోటిన్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే లూటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
కోడిగుడ్డుతో మాస్కులు వేసుకోవడం వల్ల చర్మానికి పోషకాలు అంది చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. కోడిగుడ్డులో నిమ్మరసం లేదా తేనె వంటి పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇవి మొటిమలు రాకుండా కూడా అడ్డుకుంటాయి.
కోడిగుడ్డు అలెర్జీ
కోడి గుడ్డుతో చేసే ఫేస్ మాస్కులు చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ ఖర్చును భరించగలరు. అయితే కొంతమందికి కోడిగుడ్డు అలెర్జీ కూడా ఉంటుంది. అలాంటివారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. గుడ్లను ముఖానికి పూసిన వెంటనే అక్కడ ఎరుపుదనం రావడం లేదా దురద, వాపు వంటి ప్రతిచర్య కనిపిస్తే మీకు కోడిగుడ్డు పడడం లేదని అర్థం.
సమస్యలు ఇవే
పచ్చి గుడ్లు పై సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాస్క్ ను వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన చర్మం కలవారికి కోడిగుడ్డులోని తెల్లసొన వల్ల చికాకు కలిగే అవకాశం ఉంది. అలాగే చర్మంపై దురద, అసౌకర్యంగా అనిపించవచ్చు. నిమ్మరసం వంటి ఆమ్ల పదార్ధాలతో కలిపినప్పుడు కూడా చర్మానికి చికాకుగా ఉంటుంది. ఇది సహజ పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇది తట్టుకునే చర్మం కలవారు మాత్రమే కోడిగుడ్డు మాస్కులను అధికంగా వేసుకోవాలి.
కోడి గుడ్డు మాస్కులు జిగటగా, దుర్వాసన వేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతో మంది వీటిని భరించలేరు. అయితే గుడ్డులోని తెల్ల సొనతో మాస్కులు ప్రతిరోజు వేసుకోవద్దు. చర్మం లోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం మరింతగా పొడిగా మారుతుంది. కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే వేసుకునేందుకు ప్రయత్నించండి.
కోడి గుడ్డు మాస్క్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ నిర్వహించుకోండి. మీకు ఈ కోడి గుడ్డు మాస్క్ పడుతుందో లేదో తెలిసిపోతుంది. అలాగే ఈ మాస్క్ ను కళ్ళు, నోరు, గాయాలు ఉన్నచోట రాయకండి.