Thugs With Fake Army ID: నలుగురు వెళ్లారు.. ఫేక్ ఐడీ కార్డులు చూపించారు.. ఆర్మీకి సంబంధించిన సున్నితమైన ఏరియాలో ఫోటోలు, వీడియోలు తీశారు. అనుమానం వచ్చి ప్రశ్నిస్తే.. ఒక్కరు కూడా నోరు మెదపట్లేదు. దాంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు పెట్టారు. ఇంతకీ వాళ్లు అమాయకులా? గూఢచారులా?
సికింద్రాబాద్ తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరించిన నలుగురు వ్యక్తుల వ్యవహారం ఆందోళన పెంచుతోంది. వాళ్ల దగ్గర మిలిటరీ అధికారుల పేర్లతో కూడిన ఫేక్ ఐడీ కార్డులు ఉండటం కలకలం రేపింది. ఫేక్ ఐడీలు చూపించి.. సున్నితమైన మిలటరీ ఏరియాలోకి వెళ్లి.. ఫోటోలు, వీడియోలు తీయడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో.. దేశంలో ఉగ్రవాద దాడులు జరగటానికి ముందు.. ఇదే తరహాలో రెక్కీ నిర్వహించి.. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అందువల్ల.. నలుగురు అనుమానితులకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించి.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని డిఫెన్స్ ఏరియాలన్నీ.. హై సెక్యూరిటీ జోన్‌లుగా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ నలుగురు అనుమానితులు మిలిటరీ క్యాంటీన్ గేట్ దగ్గరకు వచ్చినట్లు గుర్తించారు. ఫోటోలు, వీడియోలు తీయడం, వారి కదలికలు, ప్రవర్తనపై అనుమానం వచ్చి.. మిలటరీ అధికారులు ఆ నలుగురిని ప్రశ్నించారు. వింగ్ కమాండర్ రజత్ మిశ్రా పేరుతో ఫేక్ ఐడీ కార్డుని గుర్తించారు. దాంతో.. సీరియస్‌గానే దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల్లో ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు సఖి సెంటర్‌కు తరలించారు. మరో ఇద్దరు అబ్బాయిల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఆ ఇద్దరు యువకులు.. పోలీసులకు ఎలాంటి సమాచారం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రలో భాగమైన సమీర్‌తో వీళ్లకేమైనా సంబంధాలు ఉన్నాయా? అని కూడా ఆరా తీస్తున్నారు. అయితే.. ఆర్మీ క్యాంటీన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల కోసమే తాము అక్కడికి వచ్చామని నలుగురు అనుమానితులు చెబుతున్నారు. కానీ.. వీళ్ల దగ్గర ఫేక్ ఐడీ కార్డులు ఉండటం, అనుమానాస్పదంగా ఫోటోలు, వీడియోలు షూట్ చేయడమే ఇప్పుడు మిస్టరీగా మారింది.
Also Read: తాడో-పేడో తేలాల్సిందే..! కొడితే దిమ్మ తిరగాల్సిందే.. బయటికొస్తున్న బ్రహ్మాస్త్రాలు
ఆర్మీ అధికారులు ఫిర్యాదుతో.. తిరుమలగిరి పోలీసులు నలుగురు అనుమానితులపై కేసు నమోదు చేశారు. సంఘ విద్రోహ శక్తులతో వీళ్లకేమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు నిజంగానే అమాయకులా? వాళ్లు చెబుతున్నట్లు ఉద్యోగాల కోసమే వచ్చారా? లేక.. గూఢచారులా? మరేదైనా కారణముందా? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.