Instant Rava Dosa: రవ్వ దోశ అంటేనే నోరూరిపోతుంది. దీని కోసం ముందుగానే పిండిని నానబెట్టుకొని కష్టపడాలేమో అనుకుంటారు. అంత అవసరం లేదు. అప్పటికప్పుడే ఇనిస్టెంట్ పద్ధతిలో ఆనియన్ రవ్వ దోశను వేసేయొచ్చు. దీనికోసం మీరు కొన్ని రకాల పదార్థాలను రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు. ఆనియన్ రవ్వ దోశ సింపుల్ గా ఎలా చేసేయాలో చూసేయండి.
ఆనియన్ రవ్వ దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ – అరకప్పు
బియ్యం పిండి – అరకప్పు
మైదా – రెండు స్పూన్లు
జీలకర్ర – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
అల్లం – చిన్న ముక్క
పెరుగు – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – పావు స్పూను
నెయ్యి – తగినంత
ఆయిల్ – తగినంత
Also Read: చపాతీలు మిగిలిపోతే వాటిని బయటపడేసే కన్నా.. వీటిని వండేయండి
ఆనియన్ రవ్వ దోశ రెసిపీ
⦿ ఆనియన్ రవ్వ దోశను ఇనిస్టెంట్ గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు.
⦿ ఉదయం లేచాక మీకు ఏ టిఫిన్ చేయాలో అర్థం కాకపోతే ఈ ఆనియన్ రవ్వ దోశను ప్రయత్నించండి.
⦿ దీనికోసం మీరు ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్మా రవ్వను వేయండి.
⦿ ఆ ఉప్మా రవ్వ లోనే బియ్యప్పిండి, మైదా కూడా వేసి ఒకసారి కలపండి.
⦿ అందులోనే పెరుగును వేయండి. తగినంత నీరు వేసి ఒకసారి కలుపుకోండి.
⦿ ఆ మిశ్రమంలోనే జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకులు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లిపాయల తరుగు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
⦿ ఒక పది నిమిషాలు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
⦿ రవ్వ దోశకు మిశ్రమం చాలా పలుచగా ఉండాలి.
⦿ కాబట్టి దీన్ని పల్చగా వచ్చేలా చూసుకోండి.
⦿ ఒక స్పూను పెరుగుకు బదులు పుల్లని మజ్జిగలో కలుపుకున్న టేస్టీ గానే ఉంటుంది.
⦿ ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయండి.
⦿ ఈ రవ్వ దోశ మిశ్రమంలోంచి మూడు గరిటెల పిండిని తీసి పెనం మీద పల్చగా వేసుకోండి.
⦿ పైన నెయ్యిని చల్లుకోండి. ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు.
⦿ ఒకవైపు కాలితే చాలు తీసి పక్కన పెట్టేసుకోండి.
దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి. మీకు ఎంతో నచ్చడం ఖాయం.