Varsha Turkar Murder Case: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో జరిగిన ఎయిర్‌లైన్ ఉద్యోగిని వర్ష తుర్కర్ (35) దారుణ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ నెల 14న అటవీ ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కత్తులతో పొడిచి హత్య చేశారు. అయితే ఈ హత్య వెనుక ఆమె స్నేహితుడి భార్య హస్తం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని నిర్ధారించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలితో సహా నలుగురిని గురువారం అరెస్ట్ చేశారు.
పుణె జిల్లా ధనోరి ప్రాంతానికి చెందిన వర్ష తుర్కర్.. దీపావళి సెలవుల కోసం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కిన్హి గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వచ్చారు. నవంబర్ 14న ఆమె తన స్నేహితుడు నితీష్ అగర్వాల్‌తో కలిసి కారులో గోండియా జిల్లాలోని తిరోడాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా దవానివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోంద్రాని గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న శివాలయం వద్ద కారు ఆపారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు వర్షపై కత్తులతో దాడి చేశారు. కడుపు, వీపు భాగాల్లో పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలం నుంచి తిరోడా, ఖైర్లాంజి, వారసెయోని, బాలాఘాట్, గోండియా మార్గాల్లో ఉన్న సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నాలుగు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. నితీష్ అగర్వాల్ నడుపుతున్న కారును ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెంబడించినట్లు ఫుటేజీలో స్పష్టమైంది. సాంకేతిక ఆధారాలు, నిఘా వర్గాల సమాచారంతో నవంబర్ 19న గోండియాలోని మూర్తి గ్రామానికి చెందిన ఇమ్రాన్ కరీం షేక్ (26) అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది.
తన భర్త, వర్ష తుర్కర్ మధ్య ఉన్న సంబంధంపై నితీష్ భార్య మోనా అగర్వాల్ (41) తీవ్ర ఆగ్రహంతో ఉండేది. ఎలాగైనా వర్షను అడ్డు తొలగించుకోవాలని భావించిన మోనా.. తన ఇంటి సమీపంలో ఉండే కునాల్ కుంభాల్కర్ సాయంతో హత్యకు పథకం రచించింది. కునాల్ పాత నేరస్థుడైన షారుఖ్ పఠాన్‌ను సంప్రదించి హత్య చేసేందుకు రూ.13 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. అనంతరం షారుఖ్ పఠాన్ ఈ పనిని పూర్తి చేసేందుకు మూర్తిలోని సంజయ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ షేక్ (26), నలెన్ అలియాస్ నైలాన్ షేక్ (24), క్రిష్ రౌత్ (19)లను నియమించాడు.
Also Read: ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?
నితీష్ ప్రయాణించే కారు ఆయన భార్య మోనా పేరు మీద రిజిస్టర్ అయి ఉండటంతో పాటు దానికి జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. నితీష్ బాలాఘాట్ వెళ్లినప్పటి నుంచి మోనా జీపీఎస్ ద్వారా కారు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ హంతకులకు సమాచారం అందించింది. ఆ లొకేషన్ ఆధారంగానే దుండగులు కారును వెంబడించి బోంద్రాని అటవీ ప్రాంతంలో వర్షను అంతమొందించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం దవానివాడ పోలీసులకు అప్పగించామని పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read: డీమార్ట్‌లో మాంసాహారం, కూరగాయలు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ఎందుకు అమ్మరు? అసలు సీక్రెట్ తెలిస్తే షాకే!