ఎక్కువకాలం జీవించాలన్న కోరిక మీకు ఉందా? అయితే రోజులో అరగంట పాటు సమయాన్ని కేటాయించండి. ఆ అరగంట పాటు మీరు చేసే కొన్ని పనులు మీ ఆయుష్షుకు తొమ్మిదేళ్ళను జోడిస్తాయి. 2017లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ చేసే వ్యక్తుల్లో ఆయుష్షు 9 సంవత్సరాలు పెరుగుతుంది. ఈ అధ్యయనాన్ని బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రతిరోజు అరగంట పాటు జాగింగ్ చేయడం వల్ల దీర్ఘకాలం జీవించే అవకాశం ఉందని ఈ అధ్యయనం నిరూపించింది.
రోజూ జాగింగ్ చేస్తే చాలు
కొంతమంది 40 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల వారిలాగా కనిపిస్తారు. వాళ్లను చూసి చుట్టుపక్కల ఉన్నవారు కూడా మురిసిపోతారు. వయసు కనిపించడం లేదు అంటూ ఉంటారు. అలా వారు అసలు వయసు కన్నా తక్కువ వయసు కనిపించడానికి వ్యాయామమే కారణమని అధ్యయనం చెబుతోంది. వారు ఇంట్లో శారీరక శ్రమ చేయడం లేదా జాగింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా వయసును తగ్గించుకుంటున్నారని వివరిస్తుంది. దీనివల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని అధ్యయన రచయిత లారీ టక్కర్ వివరించారు. శారీరక శ్రమ చేసే వ్యక్తి ఆయుర్దాయం పెరుగుతుందని ఆమె తెలిపారు. ముఖంపై వృద్ధాప్య ఛాయలు కూడా చాలా తక్కువగా వస్తాయని వివరించారు.
ఇదే కారణం
వ్యాయామం చేయడం వల్ల మన క్రోమోజోముల్లో ఉన్న టెలోమియర్లు పొడవు పెరుగుతాయి. ఇవి మన జీవ గడియారంలాంటివి. మన వయసు పెరిగే కొద్దీ ఈ టెలోమియర్లు చిన్నవిగా అవుతూ ఉంటాయి. అదే శారీరకంగా చురుకుగా ఉండే వ్యక్తుల్లో మాత్రం టెలోమియర్లు పొడవుగా పెరుగుతాయి. ఇవి జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే టెలోమీయర్లు పొడవు పెరిగేలా ఉండాలంట మీరు తరుచూ శారీరక శ్రమ చేస్తూ ఉండాలి.
ఈ టెలోమియర్లు సంకోచిస్తే ఆక్సీకరణ ఒత్తిడి పెరిగిపోతుంది. కణాల వయస్సు కూడా తగ్గిపోతుంది. డిఎన్ఏ నష్టం కూడా జరుగుతుంది. శరీర కణాల పనితీరులో బలహీనత ఏర్పడుతుంది. ఇది కణాల పెరుగుతున్న వయస్సును సూచిస్తుంది. శారీరకంగా వృద్ధాప్యం వచ్చి చర్మం ముడతలు పడడం, జుట్టు నెరిసిపోవడం, అవయవాల పనితీరు మందగించడం వంటివి కనిపిస్తాయి. అదే శారీరక శ్రమ ద్వారా టెలోమియర్లు పొడవు పెంచుకుంటే మీలో వృద్ధాప్య ఛాయలు ఆలస్యంగా వస్తాయి.
Also Read: తిన్న వెంటనే పొట్టలో గుడగుడ? ఇది ఏ మాత్రం మంచి కాదట!
ఎంతసేపు వ్యాయామం చేయాలి?
మహిళలు వారానికి ఐదు రోజులు పాటు ప్రతిరోజూ అరగంట పాటు జాగింగ్ చేస్తే ఎంతో మంచిది. అదే పురుషులైతే 40 నిమిషాల పాటు జాగింగ్ చేయాలి. కేవలం జాగింగ్ ద్వారానే కాదు ఇంట్లో పనులు చేయడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. రన్నింగ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో రకంగా చేతులకు, కాళ్లకు ఇంట్లో పని చెప్పడం ద్వారా వ్యాయామం జరుగుతుంది. అలాగే మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది.