కొంతమందికి తిన్న తర్వాత బాత్రూంకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఈ పద్దతిని చాలా మంది ఎంతో తేలికగా తీసుకుంటారు. ఆహారం తిన్న తర్వాత మల విసర్జన రావడం అనేది ఆరోగ్యకరమైన సూచన కాదు. కానీ ఎంతోమంది ఈ విషయాన్ని విస్మరిస్తారు.
భోజనం చేసిన వెంటనే బాత్రూంకి పరుగులు పెట్టేవారు అజీర్ణం వల్లో, అతిగా తినడం వల్లో అలా జరిగిందని భావిస్తారు. నిజానికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. అవసరమైతే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
సాధారణంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత మలవిసర్జన చేయడం అనేది ఆరోగ్యకరం. కానీ ఆహారం తిన్న ప్రతిసారి బాత్రూంకి వెళ్లడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఆహారం తిన్న వెంటనే బాత్రూంకి వెళ్లాల్సి వస్తూ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలా ఎందుకు జరుగుతుంది?
ఆహారం తిన్న వెంటనే కొంతమంది మలవిసర్జన చేసేందుకు వెళతారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం తిన్న వెంటనే బాత్రూంకి వెళ్లాల్సి రావడం అనే సమస్యను గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్ అంటారు. ఈ సమయంలో పేగుల్లో సంకోచాలు ఎక్కువైపోతాయి. ఈ సంకోచాలు ఆహారం వ్యర్థ పదార్థాలను పేగుల ద్వారా ముందుకు తోస్తూ ఉంటాయి. దీనివల్లే ఆహారం తిన్న వెంటనే కొంతమంది బాత్రూంకి పరిగెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమస్య పేగుల్లో ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ ఉన్నవారిలో కనిపిస్తుంది.
గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్ రావడానికి కారణాలు
ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కారంగా ఉండే ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల వస్తుంది. అలాగే ఆహార అలెర్జీలు ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది. మానసిక ఆందోళనతో, డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి కూడా ఇలా జరగవచ్చు. టీ, కాఫీ అధికంగా తీసుకునే వారిలో ధూమపానం, మద్యపానం అధికంగా చేసేవారిలో కూడా ఆహారం తిన్న వెంటనే బాత్రూంకి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే గ్యాస్ట్రోయిటిస్ అనే సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఆహారం తిన్న తర్వాత మలవిసర్జన చేయాల్సి రావచ్చు. తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న వారు కూడా ఈ పని చేస్తూ ఉంటారు.
Also Read: గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?
మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి
భోజనం చేసిన వెంటనే మీకు తరచూ టాయిలెట్‌కి వెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంటే వెంటనే వైద్యులను కలవండి. అలాగే కొన్ని పనులు కూడా చేయడం మానేయండి. వైద్యులు సూచించిన మందులు వాడుతూనే… కారంగా ఉండే ఆహారం తినకండి. అలాగే తినే ఆహారాన్ని పూర్తిగా నమిలి తినడానికి ప్రయత్నించండి. మీ ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు అరగంట పాటు, వ్యాయామం చేసేందుకు ప్రయత్నించండి. అలాగే తగినంత నిద్ర కూడా చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కెఫిన్ ఉండే ఆహారాలు పూర్తిగా మానేయడం ఉత్తమం. టీ, కాఫీలను మానేస్తే ఇంకా మంచిది.