VinFast Electric Scooters: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత టూ వీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన ఈ సంస్థ.. వచ్చే ఏడాది మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేయాలని భావిస్తోంది. ఇవో (Evo), క్యో (Kyo), కైనెట్ (Kinet) మోడళ్ల ఆధారంగా వీటిని డెవలప్ చేస్తోంది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వీటిలో కీలక మార్పులు తీసుకురానుంది.
విన్‌ఫాస్ట్ తీసుకురానున్న మూడు స్కూటర్లను స్థానికంగానే తయారు చేయనుంది. ఇక్కడి రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద బూట్ స్పేస్ లాంటి మార్పులు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటి పేర్లు కూడా మార్చే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ మూడు మోడళ్లలో హబ్ మౌంటెడ్ మోటార్లు ఉండనున్నాయి. వియత్నాం వెర్షన్లలో 3kWh బ్యాటరీ కెపాసిటీ ఉంది. భారతీయ మోడళ్లలోనూ ఇదే బ్యాటరీని కంటిన్యూ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని మాత్రం భారత్‌లో కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
వియత్నాంలో అందుబాటులో ఉన్న మోడళ్లను పరిశీలిస్తే, ఇవో ఈ మూడింటిలో లో బడ్జెట్ స్కూటర్. ఇందులో 2.45kW గరిష్ట శక్తిని అందించే మోటార్ ఉంటుంది. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పాటు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రెండు రిమూవబుల్ బ్యాటరీలు, 12 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ దీని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. క్యో స్కూటర్లో 3kW మోటార్, 160 కిలోమీటర్ల రేంజ్ లభిస్తోంది. 14 అంగుళాల వీల్స్, 21 లీటర్ల స్టోరేజ్, TFT డిస్ ప్లే, కీలెస్ ఆపరేషన్, హిల్ హోల్డ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక కైనెట్ స్పోర్టీ మోడల్ గా రానుంది. ఇందులో 5.2kW మోటార్ ఉండగా, గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. దీని రేంజ్ 145 కిలోమీటర్లు. కేవలం ఆరు సెకన్లలో గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
భారత్‌లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ లాంటి సంస్థలకు విన్‌ఫాస్ట్ స్కూటర్లు పోటీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే 34 నగరాల్లో 50 మంది డీలర్లతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీ.. 2027 చివరి నాటికి 100 నగరాల్లో 300 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం భారత్‌లో 55 నగరాల్లో 77 షోరూమ్‌ల ద్వారా కార్లను విక్రయిస్తోంది. అయితే, టూ వీలర్స్ అమ్మకాలు, సర్వీసింగ్ కోసం ప్రత్యేక నెట్వర్క్ ను ఏర్పాటు చేయనుంది.
Read Also: ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు.. డిసెంబర్ లో మార్కెట్లో అడుగు పెట్టనున్న 10 క్రేజీ స్కూటర్లు!