Kalchina Vankaya Roti Pachadi: తెలుగింటి భోజనంలో పచ్చళ్లకు ఉండే ప్రత్యేకతే వేరు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, పక్కన మంచి రుచికరమైన పచ్చడి ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. ముఖ్యంగా వంకాయతో చేసే పచ్చళ్లకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అలాంటి వాటిలో కాల్చిన వంకాయ రోటి పచ్చడి ఒకటి. వంకాయను నేరుగా మంటపై కాల్చి తయారు చేయడం వల్ల దీనికి మంచి పొగ వాసన, ప్రత్యేకమైన రుచి వస్తాయి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు కలిపి రోటిపై దంచితే ఆ రుచే వేరు. ఎలాంటి కృత్రిమ రుచులు లేకుండా ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే ఈ పచ్చడిని వేడి అన్నంతోనే కాదు, రాగి సంగటి, జొన్న రొట్టెలతో కూడా తింటే చాలా బాగుంటుంది.
పెద్ద వంకాయ – ఒకటి
పచ్చిమిర్చి – 4 నుంచి 5
వెల్లుల్లి రెబ్బలు – 6
చింతపండు – చిన్న నిమ్మకాయంత
జీలకర్ర – అర టీస్పూన్
Also Read: అచ్చం 5 స్టార్ హోటల్ రుచి.. చాలా సింపుల్‌గా ముర్గ్ మలై కోఫ్తా!
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
ఉల్లిపాయ – ఒకటి
నూనె – ఒక టీస్పూన్
ఒక పెద్ద వంకాయను శుభ్రంగా కడిగి తుడవాలి. దానికి కొద్దిగా నూనె రాసి నేరుగా గ్యాస్ మంటపై పెట్టి అన్ని వైపులా సమానంగా కాల్చుకోవాలి. వంకాయ లోపల మెత్తగా ఉడికి, పైన తొక్క పూర్తిగా నల్లగా మారే వరకు కాల్చాలి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను పూర్తిగా తీసేసి, లోపల ఉన్న గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు రోటిపై పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, తగినంత ఉప్పు వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాల్చి పెట్టుకున్న వంకాయ గుజ్జును వేసి మరోసారి కలిసేలా దంచాలి. చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన కాల్చిన వంకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు.
Also Read: ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ స్పెషల్ ‘బ్యాంగ్ బ్యాంగ్ చికెన్’ చేసి పెట్టండి.. ఫిదా అయిపోతారు!