Desk Job Walking 10000 Steps| ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చుని పనిచేస్తున్నారా? పని ఒత్తిడి, మీటింగ్‌లు, డెడ్‌లైన్‌ల మధ్య వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదా? అయితే మీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజువారీ పనుల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. రోజుకు 10,000 అడుగులు నడిచే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
నడక అనేది ప్రతి ఒక్కరూ సులభంగా చేయగలిగే వ్యాయామం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు నియంత్రణకు సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి, శరీరానికి చురుకుదనాన్ని అందిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకు 10,000 అడుగులు వాకింగ్ చేయడాన్ని ఫిట్‌నెస్ టార్గెట్‌గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే రోజుకు 9 గంటలు డెస్క్ ముందు కూర్చుని పనిచేసేవారికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంటుంది. సుమారు 10,000 అడుగులు అంటే 7.5 నుంచి 8 కిలోమీటర్ల దూరం. దీనికి దాదాపు 90 నుంచి 100 నిమిషాల వాకింగ్ అవసరం కావచ్చు. అయితే ఒకేసారి ఇంతసేపు నడవాల్సిన అవసరం లేదు. రోజంతా కొద్దికొద్దిగా నడిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
మీరు ఆఫీసులో ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తున్నప్పటికీ కొన్ని సులభమైన అలవాట్లతో రోజువారీ అడుగుల సంఖ్యను పెంచుకోవచ్చు.
టార్గెట్: 1,500 నుంచి 2,500 అడుగులు
ఉదయం కనీసం 15 నుంచి 20 నిమిషాలు ముందుగా నిద్రలేచి వాకింగ్ చేయండి. ఇంటి దగ్గర పార్క్‌లో లేదా వీధుల్లో వేగంగా నడవండి. ఇలా చేయడం వల్ల ఆఫీసుకు వెళ్లకముందే మీ రోజువారీ లక్ష్యంలో కొంత భాగాన్ని పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది.
టార్గెట్: 3,500 నుంచి 4,500 అడుగులు
ఆఫీసులో పనిచేసేటప్పుడు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకండి. ప్రతి గంటకు 5 నిమిషాలు లేచి నడవండి. ఇలా 8 గంటల్లో 40 నిమిషాల పాటు శరీరాన్ని కదిలించవచ్చు.
టార్గెట్: 3,000 నుంచి 4,000 అడుగులు
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే సోఫాలో కూర్చోకుండా కొద్దిసేపు నడవండి. రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయండి. దీనివల్ల మరో 1,000 నుంచి 1,500 అడుగులు పూర్తి చేయవచ్చు.
టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇంట్లోనే అటూ ఇటూ నడవండి. ఇలా చేస్తే ప్రత్యేకంగా సమయం కేటాయించకుండానే అడుగుల సంఖ్య పెరుగుతుంది.
Also Read: మిస్డ్ కాల్స్‌తో రూ.8,300 కోట్ల కంపెనీ.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ బిజినెస్ ఐడియా
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నారో తెలుసుకోండి. మీ పురోగతిని గమనిస్తూ క్రమంగా లక్ష్యాన్ని పెంచుకోండి.
Also Read: స్మార్ట్‌ఫోన్ కారణంగా వెన్నునొప్పి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
ప్రతిరోజూ 10,000 అడుగులు నడవడం మంచి లక్ష్యమే. అయితే అందరూ తప్పనిసరిగా ఇన్ని అడుగులు నడవాల్సిన అవసరం లేదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజుకు 7,000 నుంచి 8,000 అడుగులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
ప్రారంభంలో తక్కువ అడుగుల లక్ష్యాన్ని పెట్టుకుని క్రమంగా పెంచుకోండి. ముఖ్యంగా ప్రతిరోజూ శరీరాన్ని చురుకుగా ఉంచడం అలవాటు చేసుకోండి.