వివాహం జీవితకాలం సాగే ఒక ఒప్పందం. ఇది ఇద్దరు మనుషులే కాదు, రెండు కుటుంబాల కలయిక. అలాగే మరో కుటుంబం సృష్టి కూడా పెళ్లితోనే మొదలవుతుంది. ఆ పెళ్లి జీవితాంతం ఆనందంగా సాగాలంటే ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఆధునిక యుగంలో ఎన్నో అంతు పట్టని వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అందుకే వివాహానికి ముందు కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు జంటలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ వివాహమైనా పెద్దలకు కుదిర్చిన వివాహమైనా.. భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఐదు పరీక్షలు ఇద్దరూ చేయించుకొని వాటి ఫలితాలను తెలుసుకోండి. అప్పుడే వివాహం చేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోండి.
తలసేమియా స్క్రీనింగ్
తలసేమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే అది పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇది తీవ్రమైన రక్త రుగ్మత. ఈ సమస్యతో పుట్టే పిల్లలు ఆనందంగా జీవించలేరు. వారిని కన్న తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడతారు. తలసేమియా వల్ల పిల్లలు మరణించే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి తలసేమియా తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా కూడా వారి పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి అలాంటి వారిని పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం.
లైంగిక వ్యాధులు
హెచ్ఐవి, హెపటైటిస్ సి, సిఫిలిస్, గోనేరియా వంటివన్నీ కూడా లైంగికంగా సంక్రమించే వ్యాధులు. ఇవి ఒక మనిషిలో ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి వివాహానికి ముందే ఈ పరీక్షలు కాబోయే భాగస్వామిని చేయించుకోమని చెప్పండి. ఆ ఫలితాలను బట్టి మీరు వివాహానికి ముందడుగు వేయండి. ఇద్దరు భాగస్వాములు ఆరోగ్యంగా ఉంటేనే వారి పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. అలాగే వారి వివాహం కూడా ఆనందంగా కొనసాగుతుంది.
సంతానోత్పత్తి పరీక్ష
పెళ్లయ్యాక తల్లిదండ్రులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సంతానోత్పత్తి ప్రొఫైల్ ను చెక్ చేయించుకోవాలి. పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలు ఇద్దరిలో ఎవరిలోనైనా ఉండవచ్చు. అవి ముందుగానే గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే చికిత్స కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
రక్త వర్గం
పెళ్లికి ముందే స్త్రీ పురుషులు ఇద్దరూ తమ రక్త వర్గం పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే స్త్రీ Rh నెగిటివ్ రక్త గ్రూపుకు చెందిన వ్యక్తి అయితే, పురుషుడు Rh పాజిటివ్ రక్త గ్రూపుకి చెందిన వారైతే వారిద్దరికీ భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. వైద్యులు వాళ్ళిద్దరికీ యాంటీ డీ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని, అలాగే పునరుత్పత్తి సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు.
జన్యు ప్రొఫైల్
ఒకరి కుటుంబంలో మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మానసిక సమస్యల చరిత్ర ఉండే అవకాశం ఉంది. కానీ వాటిని ఎవరూ బయట పెట్టుకోరు. అందుకే ముందుగానే జన్యు రుగ్మత స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. వివాహానికి ముందు దీన్ని చేయించడం వల్ల వారి కుటుంబంలో ఎవరికైనా మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటివి ఉంటే కాబోయే భాగస్వామికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో కూడా తెలిసిపోతుంది. ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చు.