Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో హాట్ హాట్ డిస్కషన్‌కు రంగం సిద్ధమైంది. వారం రోజుల పాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార, ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరు పక్షాల అగ్ర నేతలు రెడీ అవుతున్నారు.
ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైన విపక్షాలు
అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంషు త్రివేది, నిషికాంత్ దూబేలతోపాటు.. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీయే సభ్యులు సైతం మాట్లాడతారు.
విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్న అధికార పక్షం
మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్‌తో పాటు, ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశముంది. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం తానే వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిని విదేశాంగ శాఖ తోసిపుచ్చినా.. ట్రంప్ అవే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.
మధ్యాహ్నం చర్చలో పాల్గొనున్న ప్రధాని నరేంద్ర మోడీ
ఇక, ప్రధాని మోడీ మౌనం వహించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. మరోవైపు… కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాత్రం ఉగ్రవాద దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో పార్టీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా? లేదా? అనే డౌట్ నెలకొంది.
Also Read: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వయిరీ
పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. వరుసగా మూడు రోజుల పాటు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ దిగువ సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్.జైశంకర్ మాట్లాడుతారని తెలుస్తోంది. ప్రధాని మోడీ సైతం సభలో సమాధానం చెప్పే అవకాశముంది.