Director Sekhar Kammula : దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలు రొటీన్ కు బిన్నంగా ఉంటాయి. చాలా అడ్వాన్స్డ్ గా కూడా ఉంటాయి. కొన్నేళ్లు గడిచిన తర్వాత కూడా కదలకుండా కూర్చుని చూసేలా ఉంటాయి ఆయన సినిమాలు. అలాగే ఆయన సినిమాల్లో కథ సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ, వాటిని చాలా సెన్సిబుల్ గా డీల్ చేస్తారు శేఖర్. చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమా పక్కనే ‘ఆనంద్’ ని రిలీజ్ చేశారు శేఖర్. చిరంజీవికి పెద్ద అభిమాని అయిన శేఖర్.. తన అభిమాన హీరో సినిమాకి పోటీగా ఎందుకు తన సినిమాని రిలీజ్ చేశారు అనే టాపిక్ కూడా అప్పట్లో హైలెట్ అయ్యింది.
దీనికి ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమాకి టికెట్లు దొరకని జనాలను తన ‘ఆనంద్’ సినిమాకి ఫ్రీగా తీసుకెళ్లి చూపించి అలా తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలని శేఖర్ కమ్ముల భావించారట. అలాగే చేశారు. ఆయన ప్రయత్నం ఫలించింది. ఇలా తన ప్రతి సినిమాతో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతూనే వచ్చారు శేఖర్ కమ్ముల. అయితే ఇలాంటి గొప్ప దర్శకుడిని కూడా అప్పట్లో చాలా మంది దర్శకులు రిజెక్ట్ చేశారట. అందులో కృష్ణవంశీ కూడా ఒకరని దర్శకులు శేఖర్ కమ్ముల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అమెరికాలో డైరెక్షన్ కోర్స్ చేసిన శేఖర్ కమ్ముల ‘నిన్నే పెళ్ళాడతా’ అనే సినిమా చూసి ఫిదా అయిపోయారట. అమెరికాలో రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో శేఖర్ కమ్ములని ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయట. దీంతో ఇండియాకి వచ్చిన తర్వాత కృష్ణవంశీ వద్ద ఎలాగైనా ఎడి (అసిస్టెంట్ డైరెక్టర్) గా పనిచేయాలని భావించారట శేఖర్ కమ్ముల.
అలా ‘సింధూరం’ సినిమా సెట్స్ కి వెళ్లి కృష్ణవంశీని కలిస్తే.. అప్పటికే ఆయన వద్ద చాలా మంది టీం మెంబర్స్ ఉన్నట్టు తెలిపి సున్నితంగా శేఖర్ కమ్ములని రిజెక్ట్ చేశారట. ఆ టైంకి శేఖర్ కమ్ముల బాధపడ్డారట. కానీ ఆయన దర్శకుడు అయిన తర్వాత కృష్ణవంశీని అర్ధం చేసుకున్నట్టు శేఖర్ కమ్ముల తెలిపారు. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల తీసే ప్రతి సినిమాని ముందుగా కృష్ణవంశీకి చూపించి ఆయన అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నట్టు కూడా తెలియజేశారు.
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 130 కోట్ల వరకు వసూళ్లు చేసింది.