Meet the World’s Happiest Man: ప్రపంచం అంతా బిజీ బిజీ అయిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలంతా కాలంతో పాటు పరిగెడుతున్నారు. పోటీలో ఎక్కడ వెనుకబడిపోతామో అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. కానీ, కొంత మంది వాటన్నింటినీ వదిలేసి సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. సంతోషం అనేది కేవలం ఓ భావోద్వేగం మాత్రమే కాదు. అది మన మెదడు పనితీరు, మానసిక ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో మొదటివారు ఫ్రాన్స్ కు చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మాథ్యూ రికార్డ్. ఆయనను ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలాగంటే..
అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సైంటిస్టులు మాథ్యూ రికార్డ్ మెదడుపై ఏళ్ల తరబడి అధ్యయనం నిర్వహించారు. సుమారు 12 సంవత్సరాల పాటు ఆయన మెదడు పనితీరును పరిశీలిస్తూ పలు పరీక్షలు చేశారు. ఈ పరిశోధనలో ఆయన ధ్యానం చేసే సమయంలో మెదడులో జరిగే మార్పులను ప్రత్యేకంగా గమనించారు. పరిశోధనలో భాగంగా మాథ్యూ తలకు 256 ప్రత్యేక సెన్సార్లను అమర్చారు. వీటి ద్వారా మెదడులో ఉత్పత్తి అయ్యే నాడీ సంకేతాలు, విద్యుత్ తరంగాలు, రసాయన మార్పులను రికార్డు చేశారు. ముఖ్యంగా ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో గామా తరంగాల ఉత్పత్తి అసాధారణ స్థాయిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
సాధారణంగా గామా తరంగాలు ఏకాగ్రత, అవగాహన, జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణ లాంటి అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి. మాథ్యూ మెదడులో ఈ తరంగాలు సాధారణ వ్యక్తులతో పోలిస్తే చాలా ఎక్కువగా కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు. ఇంత ఎక్కువ స్థాయిలో గామా తరంగాల ఉత్పత్తిని తాము ఇంతకుముందు ఎప్పుడూ గమనించలేదన్నారు. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, సంతోషం, కరుణ, సహానుభూతి లాంటి భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాలు మాథ్యూ రికార్డ్ లో మరింత చురుకుగా పని చేస్తున్నాయి. అందుకే ఆయన మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతున్నారని చెప్పుకొచ్చారు.
మాథ్యూ రికార్డ్ ఫ్రాన్స్ కు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే తత్వశాస్త్రం, మానసిక శాస్త్రం లాంటి అంశాలపై ఆసక్తి పెంచుకున్నారు. 26 ఏళ్ల వయసులో బౌద్ధ సన్యాసిగా మారి టిబెటన్ ఆధ్యాత్మిక సంప్రదాయాలను అభ్యసించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ధ్యానం, ఆధ్యాత్మిక సాధనను తన జీవితంలో భాగంగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఆయనపై జరిగిన అధ్యయనాలు కూడా ధ్యానం మానసిక ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో చూపిస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెగ్యులర్ గా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అలాగే, మెదడులో డోపమైన్, సెరటొనిన్ లాంటి సంతోషాన్ని పెంచే రసాయనాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఇతరుల పట్ల ప్రేమ, అనుభూతి కూడా పెరుగుతాయి. ఆనందం అనేది కేవలం బాహ్య పరిస్థితులపై ఆధారపడదు. ఆలోచనలు, మనసు ప్రశాంతత, ధ్యానం లాంటి అలవాట్లు కూడా సంతోషాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మాథ్యూ రికార్డ్ జీవితం దీనికి మంచి ఉదాహరణగా చెప్తున్నారు పరిశోధకులు.
Read Also: సంతోషం కోసం ప్రపంచమంతా వెతుకుతున్నారా? నిజమైన సంతోషం కోసం ఈ సీక్రెట్స్ తెలుసుకోండి