Vatsala Rajagopal:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస విషాదాలను బట్టి చూస్తే అక్టోబర్ నెల కోలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది అని చెప్పవచ్చు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా, ఆయన సోదరుడి కుమారుడు కార్తీక్ సభేష్, దేవా దగ్గర నేపథ్య గాయకుడిగా పనిచేసిన కృష్ణరాజు రామస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అక్టోబర్ నెలలో తుది శ్వాస విడిచారు. అయితే ఇప్పుడు మరో కోలీవుడ్ సీనియర్ నటి కన్నుమూయడంతో కోలీవుడ్ సినీ పరిశ్రమకు ఏమయింది? ఎందుకు ఇలా నటీనటులు ఒకరి తరువాత ఒకరు స్వర్గస్తులవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక సీనియర్ నటి కన్నుమూయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ఎవరో కాదు.. ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్ కి బామ్మ పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రముఖ తమిళ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (Vatsala Rajagopal). ఇందులో తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో , నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమె.. ఎన్టీఆర్ బామ్మగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే తన వృద్ధాప్య సమస్యలతో 92 సంవత్సరాల వయసులో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈమె పార్తివదేహాన్ని చెన్నైలోని పల్లవరంలో ఉన్న ఆమె నివాసంలో దర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వత్సలా రాజగోపాల్ మరణానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
రంగస్థల కళాకారిణిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. తన 60వ యేట మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో సుమారుగా 400కు పైగా చిత్రాలలో నటించిన ఈమె.. అదుర్స్ సినిమాతో మరింత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు
కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈమెకు.. పాఠశాలలో ఉన్నప్పుడే నృత్యం, నాటక రంగంపై ఆసక్తి కలిగింది. నాటక రంగంపై ఉన్న ఆసక్తితో ఒక నాటక బృందంలో కూడా చేరిన ఈమె వివాహం తర్వాత 1953లో చెన్నైకి వచ్చి అక్కడ క్లర్క్ గా పనిచేశారు. రంగస్థలం ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో డైరెక్టర్ మణిరత్నం దృష్టిని ఈమె ఆకర్షించారు.. అలా తొలిసారి రోజా చిత్రంలో ఒక పాత్ర చేశారు. 1992లో వచ్చిన ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఈమె హీరోయిన్ మధు అమ్మమ్మ పాత్ర పోషించారు. తన కెరీయర్లో 400కు పైగా చిత్రాలలో నటించిన ఈమె.. సతీ లీలావతి, ధామ్ ధూమ్ వంటి చిత్రాలలో నటించారు . సినిమాలే కాకుండా ఈమె ఆనందం, చిత్తి, వసంతం వంటి సీరియల్స్ లో కూడా నటించారు.