వేసవి కాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వాటర్ పార్క్‌కు వెళ్లడం చాలా మందికి మంచి వినోదం. అక్కడ చల్లని నీటి కొలనులు, రకరకాల స్లైడ్లు, సరదా ఆటలు రోజంతా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే సరైన ప్రణాళిక లేకుండా వెళ్తే కొన్ని చిన్న పొరపాట్లు మొత్తం ట్రిప్ అనుభవాన్ని పాడుచేయవచ్చు. ముందుగానే కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజంతా సరదాగా గడపవచ్చు.
చాలామంది వాటర్ పార్క్‌కు సాధారణ దుస్తులతో వెళ్తారు. జీన్స్ లేదా కాటన్ దుస్తులు నీటిని ఎక్కువగా పీల్చుకుని బరువుగా మారతాయి. దీంతో స్లైడ్లు ఉపయోగించేటప్పుడు అసౌకర్యంగా అనిపించవచ్చు. చాలా వాటర్ పార్కులు నైలాన్ లేదా సింథటిక్ స్విమ్‌వేర్‌ను మాత్రమే అనుమతిస్తాయి. కాబట్టి ఇంటి నుంచి బయలుదేరే ముందు అక్కడి నిబంధనలు తెలుసుకోవడం మంచిది.
నీళ్లలో ఉన్నప్పుడు ఎండ ప్రభావం తక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ చర్మంపై ఎండ ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల చర్మం కాలిపోవడం లేదా నల్లబడే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటర్ పార్క్‌లోకి వెళ్లే ముందు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేయడం మంచిది.
వాటర్ పార్క్‌లో ఫోన్లు, నగలు లేదా ఖరీదైన గడియారాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అవి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా పార్కుల్లో లాకర్లు అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ అవసరం లేని విలువైన వస్తువులను ఇంట్లోనే ఉంచడం మంచిది. ఫోన్ తీసుకెళ్లాల్సి వస్తే వాటర్‌ప్రూఫ్ పౌచ్ ఉపయోగించాలి.
ప్రతి వాటర్ పార్క్‌లో కొన్ని భద్రతా సూచనలు ఉంటాయి. కొన్ని రైడ్లకు ఎత్తు లేదా బరువు పరిమితులు ఉంటాయి. అలాగే వాటిని ఎలా ఉపయోగించాలో సూచనలు కూడా ఉంటాయి. సిబ్బంది, లైఫ్‌గార్డులు ఇచ్చే సూచనలను జాగ్రత్తగా పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు.
నీళ్లలొ ఎక్కువసేపు గడిపేటప్పుడు దాహం అనిపించకపోయినా శరీరం నుంచి ద్రవాలు తగ్గుతుంటాయి. అందుకే తరచుగా నీరు తాగాలి. ఫ్రూట్ జ్యూస్‌లు లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా ఉపయోగపడతాయి. వీటి వల్ల శరీరంలో శక్తి తగ్గకుండా ఉంటుంది.
Also Read: సంతోషం కోసం ప్రపంచమంతా వెతుకుతున్నారా? నిజమైన సంతోషం కోసం ఈ సీక్రెట్స్ తెలుసుకోండి
ఎక్కువగా తిన్న వెంటనే వాటర్ రైడ్లు ఎక్కితే వికారం లేదా అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. భోజనం చేసిన కొంత సమయం తర్వాత మాత్రమే పెద్ద స్లైడ్లు లేదా రైడ్లు ఉపయోగించడం మంచిది.
టవల్స్, అదనపు దుస్తులు, అవసరమైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి. జారిపోకుండా ఉండే చెప్పులు ధరించడం మంచిది. అలాగే ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా ఉదయాన్నే పార్క్‌కు చేరుకోవడం మంచిది. పిల్లలను ఎప్పుడూ పర్యవేక్షణలో ఉంచాలి.
సరైన జాగ్రత్తలు పాటించడం వల్ల వాటర్ పార్క్‌లో గడిపే క్షణాలు గుర్తుంది పోతాయి.