Mango Miyazaki: వేసవికాలం వచ్చిందంటే అందరి కళ్లు మామిడిపండ్లపై ఉంటాయి. మార్కెట్లను రకరకాల మామిడి ముంచెత్తుతాయి. కాకపోతే తిన్నకొద్దీ తినాలనిపిస్తాయి కొన్ని రకరకాలు. ఇక ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడిపండు మన దగ్గరకు వస్తే చెప్పేదేముంది. వజ్రాల కంటే ధర ఎక్కువ. ఖమ్మంలోని ఓ రైతు ఈ మామిడిని పండిస్తున్నాడు. ఈసారి తక్కువ దిగుబడి వచ్చిందని అంటున్నాడు.
మామిడిపండుకు రారాజు బంగినపల్లి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే. భారతదేశంలో రకరకాల మామిడిపండ్లు ఉన్నాయి. ఆల్ఫోన్సో, కేసర్, రత్నం, సింధు, నీలమ్ వంటి దేశీయ రకాలే కాకుండా విదేశాల్లో ఫేమస్సైన మామిడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500కు పైగా రకాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే అంతర్జాతీయంగా ప్రముఖ్యత పొందాయి. వాటిలో కీలకమైనది మియాజాకీ మామిడి రకం.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి
ప్రపంచంలో అత్యంత విలువైన, ఖరీదైన మామిడిగా పేరు సంపాదించుకుంది మియాజాకీ మామిడి. ఇది జపాన్‌లోని మియాజాకీ ప్రిఫెక్చర్‌లో పండుతుంది కాబట్టి అదే పేరుతో ప్రసిద్ధి చెందింది. జపనీస్‌లో దీనిని ‘Taiyo no Tamago’అంటారు. అంటే ‘సూర్యుని గుడ్డు’ అని పిలుస్తారు, ఎర్రటి రంగు, మృదుత్వం, ఆపై తీపి దీని సొంతం. కేవలం రుచి మాత్రమేకాదు.
ఆరోగ్యానికి మంచిదన్నది కొన్ని నివేదికల మాట. రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తంలో ఇన్సులెన్స్ స్థాయిని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఒక్కో మామిడి పండు బరువు కనీసం 350 గ్రాములు ఉంటుంది. ఎర్రగా పండినపుడు 15 శాతం కంటే ఎక్కువ చక్కెర దీని సొంతం. దీనివల్ల మామిడి ధర లక్షల్లో పలుకుతుంది.
ALSO READ: కాశ్మీర్ యాపిల్స్‌కి మరీ అంత క్రేజ్ ఎందుకు?
రెండేళ్ల కిందట మియాజాకీ జత వేలంలో సుమారు 2.7 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇటీవల భారత్‌లో కొంతమంది రైతులు ఈ మామిడిని పెంచుతున్నారు. పంజాబ్‌లో ఓ రైతు మియాజాకీ మామిడి రకాన్ని పండిస్తున్నాడు. వాటిని దొంగిలించకుండా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నాడు.
ఖమ్మంలో మియాజాకీ రకం
ఈ మామిడి గురించి విషయం తెలుసుకున్నాడు ఖమ్మంకి చెందిన విజయకుమార్ అనే రైతు. కరోనా సమయంలో మియాజాకి మామిడికి శ్రీకారం చుట్టాడు. తనకు తెలిసివారి ద్వారా ఒక్కో మొక్కకు 15 వేలు పెట్టి తెప్పించాడు. కేవలం 15 మొక్కలు మాత్రమే తెప్పించాడు. ఈ ఏడాది 100 కాయలు కాసిందని చెప్పాడు. సేంద్రియ పద్దతుల్లో దీన్ని పండిస్తున్నట్లు వెల్లడించాడు ఆ రైతు. పండ్ల రక్షణ కోసం కుక్కలను కాపాలా పెట్టాడు.
మంచి ఔషద గుణాలున్న ఈ చెట్లకు మన వాతావరణానికి సాగు సరిగా సరిపోతుందని అంటున్నాడు. ఈ రకాన్ని బంగ్లాదేశ్, ఇండియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వాటిని పెంచుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఖమ్మం మియాజాకీ మామిడి పండు మనకు అందుబాటులోకి రానుందన్నమాట.