Fake Social Account: టెక్నాలజీ దుర్వినియోగం అవుతుంది. మహిళలు, విద్యార్ధులను సోసల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేసి.. వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హణనానికి పాల్పడుతున్నారు.
ఇక తాజాగా కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. వారి ఫొటోలతో అకౌంట్స్ క్రియేట్ చేసి, బయో కూడా రాశారు. సోఫియా, వ్యోమిక సొంత ఖాతాల్లాగా మార్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత.. ఈ ఇద్దరు అధికారులు మీడియాకు బ్రీఫింగ్ ఇస్తూ వచ్చారు. దాంతో నెటిజన్లు.. సోఫియా, వ్యోమికాను ఫాలో అయ్యేందుకు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అలా ఫేక్ ఖాతాలను రాత్రికి రాత్రే లక్షల మంది ఫాలో అయ్యారు.
సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లు బాగా ఫేమస్ అవడంతో వారి పేర్ల మీద పుట్టగొడుల్లా ఫేక్ ఎక్స్ అకౌంట్లు క్రియోట్ అయ్యాయి. ఇక వాటిలో చాలా ఎక్స్ ఖాతాలకు బ్లూ టిక్ ఉండటంతో నెటిజన్లు అవే నిజమైనవని భావిస్తూ.. ఆ అకౌంట్లను ఫాలో అవుతున్నారు. తమ సోషల్ మీడియాలో ఖాతాలో పెట్టిన సమాచారాన్ని నిజంగానే సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పెట్టినట్లు భావించి వైరల్ చేస్తున్నారు.
ఐతే శనివారం కాల్పుల విరమణ తర్వాత.. సోఫియా ఖురేషి ఫేక్ ఖాతా నుంచి ఓ పోల్ పెట్టారు కేటుగాళ్లు. కేంద్రం నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారా లేదా అంటూ పోస్టు పెట్టారు. దీంతో ఇది నకిలీ ఖాతా అని గుర్తించిన నెటిజన్లు.. P.I.Bని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ చేయగా.. ఆ ఖాతాలు నకిలీవని తేలింది. ఆ ఇద్దరు మిలటరీ అధికారులకు అసలు X అకౌంట్లు లేవని తేల్చింది.
Also Read: దోస్త్ కాదు దుష్మన్.. భారత్‌పై విషం కక్కిన తుర్కియే
ఆధునిక యుగంలో సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పౌరులు, సామాజిక స్పృహ పెరగడంలో క్షేత్ర స్థాయి పరిష్కారంలో సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాను, మీడియాను కూడా ఫాలో కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అసభ్యకర పోస్టులు, ట్రోలింగ్‌లు వివాదాలతో సోషల్ మీడియా సహవాసం చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుకూలంగా మార్చుకుంటూ.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూ.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న కొందరు కేటుగాళ్లు సమాజంలో అశాంతికి కారణం అవుతున్నారు.