Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. చేవెళ్ల-తాండూరు మధ్య ప్రాంతాన్ని “డెత్ కారిడార్”గా అభివర్ణిస్తూ, ఈ మార్గంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ప్రాంతంలో తరచూ ప్రాణాంతక ప్రమాదాలు జరగడానికి గల కారణాలను HRC విశ్లేషించింది. రోడ్డు పరిస్థితులు అధ్వాన్నంగా ఉండటం, డివైడర్లు లేకపోవడం, వాహనాల అతి వేగం, ఓవర్ లోడింగ్, జాతీయ రహదారి (NH-163) విస్తరణ పనులలో జరుగుతున్న తీవ్ర జాప్యం వంటి అంశాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఇది పూర్తిగా పరిపాలనా నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల వైఫల్యమేనని HRC తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఈ వైఫల్యాలపై స్పష్టత కోరుతూ, HRC ఆరు కీలక శాఖల ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. NH-163 నిర్వహణ, విస్తరణ పనుల ప్రస్తుత స్థితి, భద్రతా నిబంధనల అమలుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా, రోడ్లు & భవనాల విభాగం నుండి నివేదిక కోరింది. పోలీసు దర్యాప్తు, ట్రాఫిక్ చట్టాల అమలు, దోషులపై తీసుకున్న చర్యల గురించి హోం శాఖ ప్రధాన కార్యదర్శిని వివరణ అడిగింది. గనులు & భూగర్భ శాస్త్ర విభాగాన్ని గ్రావెల్ క్వారీల నియంత్రణ, టిప్పర్‌ల ఓవర్‌లోడింగ్‌పై తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించింది.
అదేవిధంగా, మీర్జాగూడ-తాండూర్ స్ట్రెచ్‌లో రహదారి పరిస్థితి, విస్తరణ పనుల పురోగతిపై NHAI ప్రాంతీయ అధికారిని ఆరా తీసింది. జిల్లా కలెక్టర్‌ను సహాయక చర్యలు, ఎక్స్-గ్రేషియా చెల్లింపులు, అధికారుల సమన్వయంపై, TGRTC ఎండీని ప్రయాణీకుల ఓవర్‌లోడింగ్, వాహన నిర్వహణ, అంతర్గత విచారణపై నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఈ సంబంధిత శాఖలన్నీ తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికలను డిసెంబర్ 15వ తేదీలోపు తమకు సమర్పించాలని HRC గడువు విధించింది.
చేవెళ్ల సమీపంలోని ఇందిరా రెడ్డి నగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం టిప్పర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తేలిందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులకు చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్, లలితా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇక స్వల్ప గాయాలైన వాళ్లు చికిత్స అనంతరం స్వస్థలాలకు వెళ్లిపోయారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, టి.జి.ఎస్.ఆర్టీసీ నుంచి రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వం రూ. 2 లక్షలు అందిస్తుంది. అదనంగా, వాహన ఇన్సూరెన్స్ ద్వారా కూడా పరిహారం చెల్లించనున్నారు.