PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసిసి వన్డే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాపై 52 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ చారిత్రక విజయంతో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Also Read: SRH -IPL 2026: హైదరాబాద్ ఫ్యాన్స్ కు షాక్… కాటేరమ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?
ఫైనల్ లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన అత్యుత్తమ నైపుణ్యం, గొప్ప ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని కొనియాడారు ప్రధాని మోదీ. భారత విజయం పై ప్రధాని స్పందిస్తూ.. “టోర్నీ ఆధ్యాంతం మన జట్టు అసాధారణమైన టీం వర్క్, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారిణులకు నా అభినందనలు. ఈ విజయం క్రీడలను కెరీర్ గా ఎంచుకోవడానికి యువతను మరింత ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ విజయం దేశానికి గర్వకారణం” అని పేర్కొన్నారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 కైవసం చేసుకున్న భారత క్రికెటర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వానాన్ని ప్రధానమంత్రి కార్యాలయం బీసీసీఐకి పంపింది. ఈ క్రమంలో నేడు సాయంత్రం హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని క్రికెటర్లు ఢిల్లీకి పయనం కానున్నారు. ఇక టీమిండియా మహిళా క్రికెటర్ల పై కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, క్రీడా ప్రముఖులు కూడా అభినందనలు కురిపిస్తున్నారు. ఈ విజయం దేశంలోని కోట్లాదిమంది బాలికలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఉందని పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల నేతలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వన్డే ప్రపంచ కప్ లో విజయకేతనం ఎగురవేసిన మహిళా క్రికెటర్లకు సూరత్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలాకియా ప్రత్యేక కానుకలు ప్రకటించారు. మహిళా క్రికెటర్లకు వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానల్ లను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ కి ముందే గోవింద్ ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకి ఓ లేఖ ద్వారా తెలియజేశారు.
Also Read: IND VS SA: ఇంతకీ ఈ చిన్నారి ఎవరు.. వరల్డ్ కప్ లో ఎందుకు వైరల్ అయింది?
“ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఒకవేళ మన అమ్మాయిలు కప్ సాధిస్తే జట్టులోని సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను, వారి ఇళ్లకు సోలార్ ప్యానెల్ లను కూడా బహుమతిగా ఇస్తాను. దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలుగుమయం కావాలి” అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఆదివారం రోజు రాత్రి భారత మహిళా జట్టు విజేతగా నిలవడంతో గోవింద్ తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వీరికి తన తరుపున వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానల్ లను అందిస్తానని వెల్లడించారు.