Genetic Eye Disease: కంటి పరీక్షలు చేయించుకున్నప్పుడు అంతా నార్మల్‌గానే ఉంటుంది. పగటిపూట ఎదురుగా ఉన్న వస్తువులు కూడా స్పష్టంగానే కనిపిస్తాయి. కానీ, చీకటి పడగానే అసలు సమస్య మొదలవుతుంది. చుట్టూ ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించకపోవడం, పక్క చూపు తగ్గిపోవడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి వింత సమస్యకు అసలు కారణం ఏంటో ఇప్పటివరకు డాక్టర్లకు కూడా సరిగ్గా అంతుచిక్కలేదు. అయితే, తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించారు. రేచీకటికి కారణమయ్యే ఒక సరికొత్త జన్యు సంబంధిత కంటి వ్యాధిని వారు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ ‘జామా ఆఫ్తాల్మాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
అమెరికా, యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఈ పరిశోధన చేశారు. మన శరీరంలోని EFEMP1 అనే జన్యువులో జరిగే ఒక ప్రత్యేకమైన మార్పు (p.Arg140Trp మ్యుటేషన్) వల్ల ఈ వ్యాధి వస్తుందని తేల్చారు. దీనివల్ల వయసు పెరిగేకొద్దీ రెటీనా దెబ్బతిని, చీకట్లో చూసే సామర్థ్యం తగ్గిపోతుంది. మూడు వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులపై జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది.
మన కంటి వెనుక ఉండే రెటీనాలో కాంతిని గ్రహించే కణాలు ఉంటాయి. వీటిలో ‘రాడ్స్’ అనే కణాలు తక్కువ వెలుతురులో అంటే చీకట్లో చూడటానికి సాయపడతాయి. ఈ కొత్త జన్యు లోపం ఉన్నవారిలో ఈ రాడ్ కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణ కంటి పరీక్షల్లో వీరికి 20/20 విజన్ ఉన్నట్లు కనిపించినా.. చీకట్లోకి వెళ్లినప్పుడు కళ్లు సర్దుకోవడానికి చాలా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Also Read: చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ డ్రింక్.. ఇంట్లోనే రుచికరమైన మునక్కాయ సూప్ ఇలా చేసుకోండి!
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇదే EFEMP1 జన్యువులో మరో రకమైన మార్పు జరిగితే ‘డోయిన్ హనీకోంబ్ రెటీనల్ డిస్ట్రోఫీ’ అనే మరో అరుదైన వ్యాధి వస్తుంది. అయితే, ఆ పాత వ్యాధి నేరుగా కంటి మధ్య భాగాన్ని (సెంట్రల్ విజన్) దెబ్బతీస్తుంది. కానీ, ఇప్పుడు కొత్తగా గుర్తించిన వ్యాధి మాత్రం మధ్య చూపును ఏమీ చేయకుండా.. కేవలం పక్క చూపును, రాత్రిపూట చూపును మాత్రమే దెబ్బతీస్తుంది.
కళ్లు పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. లోపల జన్యుపరంగా ఏదైనా సమస్య ఉందేమో ముందే గుర్తించడానికి ఈ పరిశోధన డాక్టర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే ఇతర కంటి జబ్బుల గుట్టు కూడా విప్పవచ్చని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రొఫెసర్ టోమస్ అలెమాన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వ్యాధి ఎంతమందిలో ఉంది, దీనికి చికిత్స ఏంటి అనే విషయాలపై ఇంకా లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది.
Also Read: ఆఫీస్ మీటింగ్స్, ఇంటర్వ్యూలలో తడబడుతున్నారా? మీ మాటతీరును మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే!