Carrotmaxxing skin tan: చర్మం మెరిసిపోవాలని, మంచి గ్లో రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా విదేశాల్లో చలి కాలంలో కూడా ఎండ తగిలినట్లుగా ఆరెంజ్ లేదా గ్లోయింగ్ స్కిన్ కనిపించడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గతంలో ఫేక్ ట్యాన్ లోషన్లు వాడటం లేదా ఎండలో గంటల తరబడి కూర్చోవడం చేసేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా క్రియేటర్లు ఒక వింత ట్రెండ్‌కు తెరలేపారు. అవే ‘క్యారెట్‌మ్యాక్సింగ్’, ‘టమాటోమ్యాక్సింగ్’ , ‘ష్రింప్‌మ్యాక్సింగ్’ .
టిక్‌టాక్, ఇన్‌స్టాలలో కొందరు వెల్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు తాము ఎలాంటి ఆర్టిఫిషియల్ ట్యాన్ వాడట్లేదని.. కేవలం పచ్చి క్యారెట్లు తినడం వల్లే తమ చర్మానికి అద్భుతమైన మెరుపు వచ్చిందని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక క్రియేటర్ అయితే కొన్ని నెలల పాటు రోజుకు మూడు నుంచి నాలుగు పెద్ద క్యారెట్లు తినడం వల్ల తనకు నేచురల్ లుక్ వచ్చిందని చెప్పడం వైరల్ అయింది. ఇవి చూసి మరి కొందరు క్యారెట్లు, టమాటోలు, రొయ్యలు, సాల్మన్ చేపల్లో ఉండే సహజ ‘కెరోటినాయిడ్స్’ సప్లిమెంట్లను రోజువారీ రొటీన్‌లో భాగం చేసుకుంటున్నారు.
అసలు ఇందులో సైన్స్ ఏం చెబుతోందంటే.. క్యారెట్లలో బీటా-కెరోటిన్, టమాటోల్లో లైకోపీన్, రొయ్యలు లేదా సాల్మన్‌లో అస్టాక్సంతిన్ అనే నేచురల్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవి కొవ్వులో కరిగే వర్ణ ద్రవ్యాలు. మనం వీటిని ఎక్కువగా తీసుకున్నప్పుడు, అవి మన చర్మం పైపొరలో పేరుకుపోయి చర్మానికి ఒక రకమైన పసుపు లేదా నారింజ రంగును ఇస్తాయని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ నవీన్ అరోరా స్పష్టం చేశారు. ముఖ్యంగా అరచేతులు, అరికాళ్లు, ముక్కు చుట్టూ ఈ రంగు మార్పు ముందుగా కనిపిస్తుందట.
మెడికల్ పరంగా ఈ స్థితిని ‘కెరోటినీమియా’అంటారు. ఆహారం ద్వారా ఇలా రంగు మారడం సాధారణంగా.. హాని కరం కాదు, అలాగే ..ఆ ఫుడ్స్ తినడం తగ్గించగానే.. కొన్ని వారాలకు చర్మం మళ్లీ ..సాధారణ రంగులోకి వచ్చేస్తుంది. అయితే.. ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆహారంలో ..ఎలాంటి మార్పులు లేకుండానే చర్మం పసుపు రంగులోకి మారితే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, ఎందుకంటే అది ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
చాలా మంది ఈ ‘క్యారెట్ గ్లో’ వల్ల తమకు ఎండ నుంచి రక్షణ లభిస్తుందని, ఇక సన్‌స్క్రీన్ వాడాల్సిన అవసరం లేదని పొరపడుతున్నారు. కానీ.. ఇదే అతిపెద్ద అపోహ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యారెట్లు తినడం వల్ల వచ్చే రంగు యూవీ కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని అస్సలు కాపాడలేదు. సన్‌స్క్రీన్‌కు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని, ఎండలోకి వెళ్లేటప్పుడు కచ్చితంగా SPF 30 లేదా అంతకంటే.. ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ వాడాల్సిందేనని డాక్టర్లు తేల్చిచెబుతున్నారు.
అంతేకాదు..కేవలం రంగు కోసం అధిక మోతాదులో బీటా-కెరోటిన్ సప్లిమెంట్లు వేసుకోవడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో హై-డోస్ బీటా-కెరోటిన్ సప్లిమెంట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును పెంచే.. అవకాశం ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనాలు చెబుతున్నాయి.
కాబట్టి సోషల్ మీడియాలో.. కనిపించే ప్రతి బ్యూటీ ట్రెండ్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకుండా, పోషకాహారం కోసం తగిన మోతాదులో క్యారెట్లు, టమాటోలు తినడం మంచిది. అంతేకానీ సప్లిమెంట్లు తీసుకుంటూ.. సన్ ప్రొటెక్షన్ మానేయడం చర్మానికి, ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోవాలి.