KRMB Meeting: కృష్ణా జలాల పంపిణీపై జరిగిన KRMB త్రిమెన్ కమిటీ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. కానీ, ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను బలంగా వినిపించారు. ముఖ్యంగా కృష్ణా డెల్టా నీటి అవసరాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య తీవ్ర వాడివేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
19 టీఎంసీల నీటి కోసం ఏపీ పట్టు
సమావేశంలో ఏపీ అధికారులు మొత్తం 19 టీఎంసీల నీరు కావాలని కోరారు. ఇప్పటికే ఉన్న 9 టీఎంసీలకు అదనంగా, KDS నుంచి మరో 10 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కృష్ణా డెల్టాకు ప్రత్యేకంగా 10 టీఎంసీల నీరు అవసరమని ప్రస్తావించారు. మరోవైపు పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాన్ని KRMB ప్రస్తావించగా.. అది జల్ జీవన్ మిషన్ కింద వచ్చిందని ఏపీ అధికారులు వివరణ ఇచ్చారు.
కృష్ణా డెల్టాకు చుక్క నీరు ఇవ్వం: తెలంగాణ ENC
ఏపీ డిమాండ్లపై తెలంగాణ ENC రమేష్ బాబు, జల సౌధ బృందం ఘాటుగా స్పందించారు. కృష్ణా డెల్టాలో పంటలు పూర్తయ్యాక మళ్లీ పంటల కోసం నీళ్లు అడగడం ఏమాత్రం సరికాదని తేల్చి చెప్పారు. పులిచింతలలో నీళ్లు ఉన్నప్పటికీ మళ్లీ నీళ్ల కోసం ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో ఉన్నదే 45 టీఎంసీలు మాత్రమేనని, అందులో హైదరాబాద్ తాగునీటి అవసరాలకే 15 టీఎంసీలు కావాలని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకు చుక్క నీరు కూడా ఇవ్వలేమని ఖరాఖండీగా చెప్పారు.
ఎల్‌నినో ఎఫెక్ట్.. మళ్లీ భేటీకి విజ్ఞప్తి
ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని తెలంగాణ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. చివరికి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను KRMB నమోదు చేసుకుంది. ఈ అంశంపై మరొకసారి KRMB సమావేశం ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: రేవంత్ రెడ్డి నిస్సహాయతపై ప్రజల్లో ఆగ్రహం.. బాబుకు కవిత కీలక విజ్ఞప్తి