Telangana style bagara rice: తెలంగాణ వంటకం అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ‘బగారా రైస్’! ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, పెళ్లి ఇళ్లలోనైనా బగారా రైస్ లేనిదే భోజనం పూర్తి కాదు. ఘుమఘుమలాడే మసాలాలు, పుదీనా, కొత్తి మీర ఫ్లేవర్‌తో నోరూరించే ఈ స్పెషల్ రైస్‌ను ఏ నాన్-వెజ్ కర్రీతో తిన్నా ఆ మజాయే వేరు. ఇంట్లోనే పక్కా తెలంగాణ స్టైల్‌లో ఈ ట్రెండీ బగారా రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
తెలంగాణ ప్రాంతంలో బగారా రైస్‌కు ఉండే క్రేజే వేరు. ప్లెయిన్ బిర్యానీ లాగా అనిపించినా.. దీని టేస్ట్ మాత్రం చాలా యూనిక్‌గా ఉంటుంది. చికెన్ కర్రీ, మటన్ గ్రేవీ లేదా బగారా బైగన్ తో ఇది అద్భుతమైన కాంబినేషన్. ప్రతీ ఒక్కరూ ఈజీగా చేసుకునేలా పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్ తయారీ విధానం..
బాస్మతి లేదా సోనా మసూరి బియ్యం: 2 గ్లాసులు
పచ్చిమిర్చి: 5-6 (నిలువుగా చీల్చినవి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా పొడవుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు
పుదీనా, కొత్తిమీర తరుగు: ఒక కప్పు
మసాలా దినుసులు: షాజీరా (1 స్పూన్), దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు
నెయ్యి : సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు
1. ముందుగా తీసుకున్న బియ్యాన్ని (బాస్మతి లేదా సోనా మసూరి) శుభ్రంగా కడిగి, కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల అన్నం పొడి పొడిగా, మెత్తగా ఉడుకుతుంది.
2. స్టవ్ మీద మంద పాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి, 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేయాలి. నూనె కాగిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసి దోరగా వేయించాలి. ఈ మసాలా దినుసులు నూనెలో వేగగానే మంచి సువాసన వస్తుంది.
3. ఇప్పుడు ఇందులో.. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చి మిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు సరిగ్గా వేగి తేనే రైస్‌కు మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.
Also Read: రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ..నూరూరించే గోదావరి రుచి ఇంట్లోనే!
4. తర్వాత తరిగి పెట్టుకున్న గుప్పెడు పుదీనా , కొత్తి మీర వేసి బాగా మగ్గనివ్వాలి. తెలంగాణ బగారా రైస్‌లో పుదీనా ఫ్లేవర్ చాలా ముఖ్యం. ఇది అన్నానికి అద్భుతమైన సువాసనను ఇస్తుంది.
5. ఇప్పుడు నానబెట్టిన బియ్యానికి తగినట్లుగా నీరు పోయాలి (సాధారణంగా 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీరు సరిపోతుంది). తగినంత ఉప్పు వేసి నీటిని బాగా మరగనివ్వాలి. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని నీరు లేకుండా వడకట్టి వేయాలి.
6. అన్నం నీరు మొత్తం ఇంకిపోయే వరకు మీడియం మంటపై ఉడికించాలి. ఆ తర్వాత మూత పెట్టి, సన్నని మంటపై 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, గుమగుమలాడే పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ!
వేడి వేడి బగారా రైస్‌పై కొద్దిగా నెయ్యి వేసుకుని, పక్కన స్పైసీ చికెన్ లేదా మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. మీరు కూడా ఈ వీకెండ్‌లో ఈ రెసిపీని ట్రై చేయండి.