వడలు అనగానే శనగపప్పుతో చేసే మసాలా గారెలు ఎక్కువమందికి గుర్తొస్తాయి. వాటిని ఆరోగ్యంగా పాలకూర వేసి చేసుకోవచ్చు. ఇవి అద్భుతంగా ఉంటాయి. పాలకూర వడలు పిల్లలు తిన్నా కూడా వారికి ఎంతో నచ్చుతాయి. వీటిని చేయడం చాలా సులువు. పాలకూర వడలు ఎలా చేయాలో తెలుసుకోండి.
పాలకూర వడలు రెసిపీకి కావలసిన పదార్థాలు
శనగపప్పు – అర కప్పు
కందిపప్పు – రెండు స్పూన్లు
బియ్యం – ఒక స్పూను
పాలకూర తరుగు – ఒక కప్పు
కొత్తిమీర తరుగు – గుప్పెడు
కరివేపాకులు – గుప్పెడు
పచ్చిమిర్చి – రెండు
అల్లం – చిన్న ముక్క
సోంపు గింజలు – ఒక స్పూను
ఇంగువ – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
పాలకూర వడలు రెసిపీ
1. శనగపప్పు, కందిపప్పు, బియ్యాన్ని ముందుగానే గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి.
2. ఆ తర్వాత ఈ పప్పు మిశ్రమాన్ని నీటి నుంచి తీసి బయటే ఉంచాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, సోంపు, కొత్తిమీర, ఉప్పు వేసి మొదటగా రుబ్బుకోవాలి.
4. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పప్పులను కూడా వేసి ముతకగా రుబ్బుకోవాలి.
5. ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి పాలకూర, కరివేపాకును పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
6. ఆ పాలకూరను కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇది మిశ్రమం గట్టిగా ఉండేలా చూసుకోండి.
7. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోండి.
8. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.
9. ఆ నూనెలో పప్పు ముద్ద నుంచి కొంత మొత్తాన్ని తీసి చేత్తోనే వడల్లాగా వత్తుకొని వేయించుకోండి.
10. అవి క్రిస్పీగా బంగారు గోధుమ రంగులోకి మారేవరకు డీప్ ఫ్రై చేయండి.
11. ఆ తర్వాత టిష్యూ పేపర్ మీద వేయండి. అవి అదనపు నూనెను పీల్చేస్తుంది.
12. అంతే టేస్టీ పాలకూర వడలు రెడీ అయినట్టే. ఇవి తినే కొద్ది తినాలనిపిస్తాయి. పాలకూరలో ఉండే పోషకాలు అన్ని ఇందులో అందుతాయి.
ఇవి నూనె పీల్చకుండా చూసుకోండి. అదనపు నూనె ఉంటే టిష్యూ పేపర్ తో ఒకసారి గట్టిగా వత్తి ఆ తర్వాత తింటే మంచిది. ఈ డీప్ ఫ్రై చేసే ఆహారాలు కాబట్టి తరచూ తినకుండా అప్పుడప్పుడు స్నాక్స్ లాగా చేసుకోవడం మంచిది. ఈ పాలకూర వడలు క్రిస్పీగా, క్రంచిగా వస్తాయి. కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతాయి. ఇంకెందుకు ఆలస్యం వీటిని ఈరోజే ప్రయత్నించండి.