లులు మాల్. ఈ పేరుకి ఏపీ రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది. లులు మాల్ చుట్టూ రాజకీయాలు ముసురుకోవడంతో చివరకు అది ఏపీకి దూరం కావాల్సి వచ్చింది. యూఏఈకి చెందిన లులు గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా హైపర్ మార్కెట్లు నిర్వహిస్తోంది. దుబాయ్ కేంద్రంగా ఉన్న లులు మాల్స్ తమ తమ రాష్ట్రాలకు రావాలంటూ ఆయా ప్రభుత్వాలు పోటీ పడుతుంటాయి. లులు మాల్స్ వస్తే రాష్ట్రానికి అదో కళ, అంతే కాదు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ మరింతగా పెరుగుతుంది. వ్యాపారంలో పోటీ వల్ల అంతిమంగా వినియోగదారులు లాభపడతారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లులు గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది. విశాఖలో లులు మాల్ ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
వైసీపీ అడ్డంకి..
2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమితో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో లులు మాల్ ఏర్పాటు ఆగిపోయింది. విశాఖలో లులు మాల్ కి అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో వైసీపీ ప్రభుత్వం కొర్రీలు వేసింది. భూమి కేటాయింపు ఒప్పందంలో లొసుగులు ఉన్నాయంటూ మెలిక పెట్టింది. దీంతో లులు యాజమాన్యం హర్ట్ అయింది. ఏపీలో తాము పెట్టుబడి పెట్టలేమని తేల్చి చెప్పింది. ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న మాల్ ని పొరుగు రాష్ట్రం తెలంగాణకు తరలించింది. కేరళ, ఉత్తర ప్రదేశ్ లో కూడా లులు మాల్స్ ఏర్పాటయ్యాయి. అప్పట్లో జగన్ అడ్డుపడి ఉండకపోతే ఈపాటికే లులు మాల్ విశాఖకు వచ్చి ఉండేదని స్థానికులు వాపోతున్నారు. పాలనా రాజధాని అంటూ జగన్ ఊరించినా, ఆయన హయాంలో విశాఖకు మేలు జరక్కపోగా ప్రముఖ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని విమర్శిస్తున్నారు.
వైసీపీకి మచ్చ..
చివరికి లులు మాల్ వ్యవహారం వైసీపీకి మచ్చలా మారింది. లులు ని ఏపీ నుంచి జగన్ తరిమేశారని జనం బలంగా నమ్మారు. లులు ఒక్కటే కాదు, ఇతరత్రా కంపెనీలను కూడా జగన్ ఏపీనుంచి బయటకు పంపించి వేశారని తెలుస్తోంది. అందూుకే ఆ పార్టీకి 2024లో ఘోర పరాభవం ఎదురైంది.
మళ్లీ లులు..
2024లో ఏపీలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో లులు మాల్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఇంకాస్త గట్టిగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో లులు విశాఖకు తిరిగి వచ్చేందుకు సిద్ధపడింది. ఈసారి విశాఖలోనే కాదు, తిరుపతి, అమరావతి, విజయవాడలో కూడా లులు షాపింగ్ మాల్స్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
విశాఖ లులు..
లులు చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ విశాఖపట్నంలో తమ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖలో ప్రారంభించబోయే లులు మాల్ లో విస్తృత స్థాయి షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తారు. 8 స్క్రీన్‌ల ఐమాక్స్ సినిమా థియేటర్ ఏర్పాటు చేస్తారు. షాపింగ్ కోసం ఒక పెద్ద హైపర్ మార్కెట్ ఉంటుంది. ఫన్ట్యురా అనే పేరుతో పిల్లలకు గేమింగ్ జోన్ ఏర్పాటు చేస్తారు. ఫుడ్ కోర్ట్ తోపాటు భారీ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 2,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 7,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు.
అక్కడ కూడా..
ఇక అమరావతి, తిరుపతి, విజయవాడలో కూడా లులు మాల్స్ ఏర్పాటయ్యే అవకాశముంది. అమరావతిలో దాదాపు రూ.1,500 కోట్ల ఖర్చుతో మాల్, కన్వెన్షన్ సెంటర్, ఐమాక్స్ థియేటర్‌ను ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ, తిరుపతిలలో హైపర్ మార్కెట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో లులు యాజమాన్యం ఉంది.
మొత్తమ్మీద జగన్ హయాంలో తిరిగి వెళ్లిపోయిన లులు, ఇప్పుడు ఏపీకి వస్తోంది. ఈసారి విశాఖతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా మాల్స్ ఏర్పాటుకి ప్రయత్నాలు జరగడం విశేషం.