Parenting Tips: ప్రతి తల్లిదండ్రులు తమ కొడుకు ఆదర్శవంతంగా ఉండటంతో పాటు గర్వపడేలా ఉండాలని కోరుకుంటారు. చిన్న తనం నుండే మంచి అలవాట్లు , జీవిత విలువలు నేర్పినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. తల్లిదండ్రుల పెంపకం పిల్లల్లో ప్రతిబింబిస్తుందని చెబుతారు.
పిల్లల ప్రవర్తన, ఆలోచన ఆధారంగా వారు తల్లిదండ్రుల నుండి ఎలాంటి విలువలు పొందారో చుట్టూ ఉన్న వారు నిర్ణయిస్తారు. మరి పిల్లలు ఉన్నత స్థానంలో ఉండటానికి, తల్లదండ్రులను గర్వించేలా చేయడానికి మీరు చిన్న నాటి నుండే ఈ విషయాలను వారికి తప్పకుండా నేర్పించాలి.
1. ఇతరులను గౌరవించడం:
పెద్దలను గౌరవించడం పిల్లలకు చిన్న నాటి నుండే నేర్పించాలి. అంతే కాకుండా వారి కంటే చిన్న వారిని ప్రేమించడం ముఖ్యమని తెలియజేయాలి. అంతే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అపరచితులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పాలి.
2. పనులు చేయడం:
పిల్లలు చిన్న చిన్న పనులను స్వయంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే వారు ఉన్నతంగా ఎదుగుతారు.వారి బ్యాగ్ వారు సిద్ధం చేసుకోవడం, బూట్లు పాలిష్ చేసుకోవడం, బట్టలు సరైన స్థలంలో ఉంచుకోవడం వంటి పనులు స్వయంగా చేయడం పిల్లలకు చిన్నప్పటి నుండే అలవాటు చేయడం మంచిది.
3. ఇంటి పనుల్లో సహాయం చేయడం:
కూతుళ్లే కాదు, కొడుకులు కూడా ఇంటి పనుల్లో సహాయం చేయాలి. ఇళ్లు ఊడ్చడం, పాత్రలు పక్కకు పెట్టడం, ఆహారం వండడం ,బట్టలు మడతపెట్టడం చిన్నప్పటి నుండే వారికి నేర్పండి. గారాబం చేయడం వల్ల మీకే భవిష్యత్తులో కష్టం అవుతుందని గుర్తుంచుకోండి.
4. నిజాయితీగా ఉండటం:
అబద్ధాలు, మోసం విజయాన్ని తెచ్చిపెట్టలేవని మీ పిల్లలకు వివరించండి. అంతే కాకుండా నిజాయితీ, కృషి, సత్యం విలువను నేర్పండి. తనపై తనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యమని అతనికి అర్థమయ్యేలా చెప్పండి. ఏదైనా సవాలు వస్తే, దానిని ధైర్యంగా, ఓపికగా ఎదుర్కోవడం నేర్పండి. తనను తాను నమ్మడం ద్వారానే ఎలాంటి సమస్య నైనా సులభంగా ఎదుర్కోగలరని అర్థం అయ్యే లాగా వివరించండి.
5. అమ్మాయిలను గౌరవించడం:
మీ కొడుకుకు చిన్నప్పటి నుండే అమ్మాయిలు, అబ్బాయిలు సమానమని వారిని గౌరవించడం ముఖ్యమని నేర్పండి. స్త్రీలను గౌరవంగా చూసుకోవడం, అంతే కాకుండా వారి ఇష్టాన్ని కూడా గౌరవించడం ముఖ్యం అని తెలియజేయండి. ఎలాంటి సమయంలోనూ మహిళలకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని తెలియజేయండి. వీలైతే వారికి సహాయం చేయాలని చెప్పండి.
Also Read: ఆముదంలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో బట్ట తల రాదు
6. ఓటమిని అంగీకరించడం:
గెలవడం ముఖ్యం, కానీ ఓటమిని విశాల హృదయంతో అంగీకరించడం కూడా ముఖ్యం అని నేర్పండి. ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు సాగడమే నిజమైన విజయం అని తెలియజేయండి. మీ పిల్లలు ఏదైనా పోటీలో ఓడిపోతే, ఓటమిని అంగీకరించాలని నేర్పండి. మీ పిల్లలు కేవలం ముద్దుల యువరాజు, యువరాణిగా మాత్రమే కాకుండా విలువలు, స్వావలంబన , బాధ్యతలతో నిండిన బలమైన , మంచి మనిషిగా ఎదగాలని మీరు కోరుకుంటే చిన్నప్పటి నుండే ఈ మంచి అలవాట్లను నేర్పండి.