డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి. అంటే మీరు సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వల్ల వచ్చే వ్యాధి. అనారోగ్యకరమైన ఆహారం సరైన సమయానికి తినకపోవడం నిద్రపోకపోవడం వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఇప్పుడు దేశంలో ఎంతోమంది డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు.
డయాబెటిస్ వచ్చినప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలో వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలో తీవ్రంగా పెరిగి గుండెకు హాని కలిగిస్తాయి. అలాగే మూత్రపిండాలు, కళ్ళు వంటి ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించాలంటే కేవలం మందులు వేసుకుంటే సరిపోదు.. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.
నేరేడు పండ్లు రోజూ తింటే
డయాబెటిస్ అదుపులో ఉంచేందుకు నేరేడు పండు అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేరేడుపండ్ల సీజన్ ఇది అధికంగా దొరుకుతాయి. కాబట్టి ప్రతిరోజు నేరేడు పండ్లు తినడానికి ప్రయత్నం చేయండి. ఇది మధుమేహానికి ఔషధంతో సమానం. మధుమేహరోగులు చక్కెర స్థాయిలను తగ్గించడానికి నేరేడు పండ్లపై ఆధారపడవచ్చు. ఇది చక్కెర స్థాయిలను తగ్గించడమే కాదు… జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది.
రోజుకు ఎన్ని పండ్లు తినాలి?
ప్రతిరోజు ఒక 10 నేరేడు పళ్ళు తినేందుకు ప్రయత్నించండి. ఒక నెలరోజుల పాటు అలా తిని చూడండి. మీ చక్కెర స్థాయిల్లో తగ్గుదల కనిపిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. నేరేడుపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రెండూ కూడా చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి.
ఖాళీ పొట్టతో తినండి
రక్తంలో షుగర్ స్థాయిలు త్వరగా తగ్గాలంటే ఖాళీ పొట్టతో ప్రతిరోజు నేరేడు పండ్లు తినేందుకు ప్రయత్నించండి. ఉదయం లేవగానే ఖాళీ పొట్టతో వీటిని తినండి. మీకు డయాబెటిస్ అదుపులోకి రావడం సులువు అవుతుంది. అయితే మీరు తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతూ ఉంటే మాత్రం నేరేడు పండ్లను అధికంగా తినకూడదు. ఎందుకంటే నేరేడు పండ్లు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా తగ్గుతుంది. అదే రక్తపోటు తక్కువగా ఉన్నవారు తింటే మరింతగా తగ్గే అవకాశం ఉంది.
నేరేడు పండ్లు చాలా రుచిగా ఉంటాయి. సహజమైన ఊదా రంగును కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మం కూడా మెరుస్తూ యవ్వనంగా మారుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఈ పండ్లు పెంచుతాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచుకుంటుంది. ఇక ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి పొటాషియం ఎంతో అవసరం. అంతేకాదు రక్తపోటు నియంత్రించడానికి కూడా పొటాషియం కావాలి. కాబట్టి నేరేడు పండ్లను తినండం ద్వారా మీరు డయాబెటిస్ ను హైబీపీని రెండిటినీ అదుపులో ఉంచుకోవచ్చు.
బరువు తగ్గుతారు
నేరేడు పండ్లు తినడం వల్ల మీకు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ పండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఎక్కువ పీచు పదార్థాలతో ఇవి నిండి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గేందుకు ఇవి సహాయ పడతాయి. నోటి ఆరోగ్యానికి కూడా నేరేడు పండ్లు ఎంతో ముఖ్యం. చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు నేరేడు పండ్లను కనీసం నాలుగైదు నోట్లో వేసుకొని నమలడానికి ప్రయత్నించండి.
నేరేడు పండ్లలో క్యాల్షియం, భాస్వరం, మాంగనీస్, రాగి, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఎముకలు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అధిక మూత్ర విసర్జన, విపరీతమైన దాహం వంటి డయాబెటిస్ లక్షణాలతో బాధపడుతున్న వారు నేరేడు పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆ లక్షణాల నుంచి ఉపశమనం దక్కుతుంది.