Emotional Insecurity: మనం మాట్లాడే మాటలు కేవలం అవతలి వారితో కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే కాదు.. మన మనస్తత్వాన్ని, భావోద్వేగాలను కూడా తెలియజేస్తాయి. కొందరు వ్యక్తులు తమ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో, చిన్న చిన్న విమర్శలను సైతం తట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. సైకాలజిస్టుల ప్రకారం.. అలాంటి వారి ప్రవర్తన వారు రోజూ మాట్లాడే కొన్ని సాధారణ మాటల ద్వారానే బయటపడిపోతుంది.
మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌నైనా సహజంగా తీసుకోగలరు. తమ వల్ల ఏదైనా తప్పు జరిగితే బాధ్యత వహించడానికి వెనకాడరు. కానీ, భావోద్వేగాల పరంగా కాస్త బలహీనంగా ఉండేవాళ్లు తాము చేసిన తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వారు మాట్లాడేటప్పుడు ఎక్కువగా తమను తాము సమర్థించుకోవడానికి లేదా అవతలి వారిపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంటారు. మాటల్లో కనిపించే ఈ రకమైన రక్షణ ధోరణి వారి అంతర్గత అభద్రతా భావాన్ని సూచిస్తుంది.
సైకాలజిస్టుల పరిశీలన ప్రకారం.. భావోద్వేగాలను నియంత్రించుకోలేని వారు తరచూ కొన్ని నిర్దిష్టమైన మాటలను వాడుతుంటారు. ‘ఇందులో నా తప్పేమీ లేదు’, ‘నా పరిస్థితే ఇంతే.. నేనేం చేయలేను’ లేదా ‘అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు’ వంటి మాటలు వీరి నోటి వెంట ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల వారు స్వయం విమర్శ చేసుకోకుండా, తమను తాము ఎప్పటికీ మార్చుకోలేరు. ఇలాంటి ప్రవర్తన వారి వ్యక్తిగత ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది.
Also Read: సర్వీస్ సెంటర్‌కు వెళ్లడానికి ముందే.. ల్యాప్‌టాప్ రిపేర్ ఖర్చులను ఇంట్లోనే తెలుసుకోవచ్చు!
అయితే.. ఎవరైనా ఒకసారి లేదా రెండుసార్లు ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన వారు మానసికంగా బలహీనులని ముద్ర వేయలేము. ఎందుకంటే మనుషుల ప్రవర్తన అనేది ఆయా సమయాల్లో ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తరచూ, పదే పదే ఇవే మాటలను వాడుతుంటే మాత్రం, అది వారి కమ్యూనికేషన్ లోని లోపాన్ని, భావోద్వేగ అభద్రతను తెలియజేస్తుంది. కాబట్టి మాటలతో పాటు వారి సుదీర్ఘ ప్రవర్తనను కూడా గమనించాల్సి ఉంటుంది.
భావోద్వేగాలను సరిగ్గా నిర్వహించగలగడమే నిజమైన మానసిక శక్తి. మానసిక దృఢత్వం ఉన్నవారు సమస్యలు వచ్చినప్పుడు ఇతరులను నిందించకుండా, పరిష్కారాల వైపు ఆలోచిస్తారు. వారిలో ఉన్న ఇలాంటి బలహీనమైన కమ్యూనికేషన్ అలవాట్లను గుర్తించి, వాటిని మార్చుకోవడం ద్వారా బంధాలు మెరుగవుతాయి. ఎదుటివారితో గొడవలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటపై మనకు స్పృహ ఉండటం ఎంతో ముఖ్యం.
Also Read: ఇంత తక్కువ ధరలో అలాంటి ఫీచర్లా? మార్కెట్‌లోకి సైలెంట్‌గా వచ్చి రచ్చలేపుతున్న Vivo Y6a!