Rayalaseema Mutton Sukka: రాయలసీమ వంటకాలకు ఉండే క్రేజే వేరు. అక్కడ చేసే ప్రతి వంటకంలోనూ ఘాటు, నాటుతనం, అసలైన దేసీ రుచులు దాగుంటాయి. ముఖ్యంగా రాయలసీమ మటన్ సుక్కా పేరు వింటేనే ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. ఇంట్లో చేసుకునే సాధారణ మటన్ కర్రీకి భిన్నంగా, మసాలాలు చక్కగా పట్టి డ్రైగా వేయించే ఈ వేపుడు రాయలసీమ ప్రత్యేకం. వేడివేడి అన్నంలోకి, పప్పుచారు కాంబినేషన్‌లోకి లేదా జొన్న రొట్టెలతో తింటే ఆ మజానే వేరు. ఈ క్రమంలో ఇంట్లోనే సింపుల్‌గా మటన్ సుక్కా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
మేక మాంసం (మటన్) – 1/2 కేజీ
ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
టమోటాలు – 2 (ముక్కలుగా చేసినవి)
పచ్చిమిర్చి – 5 (నిలువుగా చీల్చినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – 1/2 టీస్పూన్
కారం – 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి – 1.5 టేబుల్ స్పూన్లు
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – 1 టీస్పూన్
లవంగాలు – 4
యాలకులు – 2
దాల్చిన చెక్క – 2 చిన్న ముక్కలు
నూనె – 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, కరివేపాకు – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
మీకు కావాల్సినంత మటన్‌ను శుభ్రంగా కడిగి, అందులో కొద్దిగా పసుపు, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్‌లో ఉంచాలి. కొద్దిగా నీరు పోసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేపాలి. మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.
తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. మసాలాలు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను నీళ్లతో సహా బాణలిలో పోయాలి. నీరంతా ఇంకిపోయి, నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై ఉంచాలి. చివరగా మిరియాల పొడి, గరం మసాలా పొడి చల్లి బాగా కలిపి, మరో ఐదు నిమిషాలు మందపాటి మంటపై వేయించాలి. మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టి పొడిగా మారిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేస్తే ఎంతో రుచికరమైన రాయలసీమ మటన్ సుక్కా రెడీ అయినట్టే.