Wife alimony Husband Shares Income| విడాకుల తరువాత భరణం ఎంత చెల్లించాలనే విషయాన్ని నిర్ణయించేటప్పుడు కోర్టులు కేవలం నెలవారీ జీతాన్నే చూస్తాయా? ఉద్యోగుల షేర్లు, వాటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయా? కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఈ ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చింది. భర్తకు వచ్చే జీతంతో పాటు షేర్ల ద్వారా లభించే ఆదాయాన్ని కూడా పరిశీలించిన కోర్టు, భార్య, బిడ్డకు చెల్లించే భరణాన్ని రెట్టింపు చేసింది.
భార్య, బిడ్డకు చెల్లించాల్సిన భరణాన్ని కర్ణాటక హైకోర్టు పెంచింది. భర్త ఆర్థిక పరిస్థితి, భార్య ఉద్యోగం కోల్పోవడం, ఆమె ఆరోగ్య సమస్యలు, బిడ్డ అవసరాలను కోర్టు పరిశీలించింది. భర్త తన నెలవారీ ఆదాయం సుమారు రూ.2.91 లక్షలుగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఆయన ఆదాయపు పన్ను రికార్డుల్లో గ్రాస్ సాలరీ (వార్షిక) సుమారు రూ.62.92 లక్షలుగా నమోదైంది. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల (ESOPs) ద్వారా సుమారు రూ.28.42 లక్షల విలువైన ప్రయోజనాలు కూడా ఉన్నట్లు రికార్డులు వెల్లడించాయి.
భర్తకు షేర్ల విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆదాయం ప్రతి నెలా అందకపోయినా, భరణం నిర్ణయించేటప్పుడు దాన్ని పూర్తిగా విస్మరించలేమని కోర్టు భావించింది. సీనియర్ న్యాయవాది ప్రకారం.. భరణం నిర్ణయించేటప్పుడు నెలవారీ జీతంతో పాటు ఇతర ఆదాయ వనరులను కూడా పరిశీలిస్తారు. బోనస్‌లు, అద్దె, డివిడెండ్లు, షేర్ల ద్వారా వచ్చే లాభాలు ఇందుకు ఉదాహరణలు. ఆదాయపు పన్ను రిటర్నులు, ఫామ్ 16 వంటి డాక్యుమెంట్స్ ఆర్థిక పరిస్థితిని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి.
షేర్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును రెండు ఫ్లాట్ల కొనుగోలుకు తీసుకున్న రుణాల చెల్లింపులకు ఉపయోగిస్తున్నట్లు భర్త వాదించారు. అయితే, ఆ చెల్లింపులు భరణం తగ్గించడానికి సరిపడ కారణం కాలేదు. న్యాయవాది ఖుషీ పర్మార్ ప్రకారం.. ఆస్తులు సమకూర్చుకోవడానికి తీసుకున్న రుణాల చెల్లింపులు సాధారణంగా నిర్వహణ భరణం కంటే ప్రాధాన్యత పొందవు. ప్రతి కేసులో పరిస్థితులను బట్టి కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి.
భరణం నిర్ణయించేటప్పుడు భర్త ఆదాయం, ఆస్తులు, ఖర్చులు, భార్య ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య అవసరాలు, బిడ్డ చదువు ఖర్చులు, కుటుంబ జీవన ప్రమాణాలను కోర్టులు పరిశీలిస్తాయి. గత మూడేళ్ల ఆదాయపు పన్ను రికార్డులు ఆదాయ వివరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ బాత్రా తెలిపారు. అయితే, షేర్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును లాభంగా పరిగణించలేము. అసలు లాభం ఎంత వచ్చిందో కూడా పరిశీలించాలి.
భరణం నిర్ణయించేటప్పుడు కేవలం నెలవారీ జీతమే కాకుండా, ఇతర ఆదాయ వనరులు, ఆర్థిక ప్రయోజనాలు కూడా ముఖ్యమని ఈ తీర్పు సూచిస్తోంది. అయితే, ప్రతి కేసులో అందుబాటులో ఉన్న ఆధారాలు, భార్యాభర్తల పరిస్థితులను బట్టి కోర్టులు తగిన మొత్తాన్ని నిర్ణయిస్తాయి.