How to find fake AI images: నేడు సోషల్ మీడియాలో ఏ ఫోటో చూసినా అది నిజమైనదా లేక ఏఐ తయారు చేసిందా అనే సందేహం కలగడం సహజం. టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్దీ ఏఐ ఇమేజెస్ అచ్చం అసలు ఫోటోల్లాగే కనిపిస్తూ సామాన్యులను ఈజీగా మోసం చేస్తున్నాయి. వార్తలు, ప్రమోషన్లు, సెలబ్రిటీ ఫోటోల పేరుతో వచ్చే నకిలీ ఫోటోలను నమ్మి చాలామంది తప్పుదోవ పడుతున్నారు. అలాంటి ఫేక్ ఏఐ ఫోటోలను మనం ఈజీగా కనిపెట్టడానికి ఉపయోగపడే 4 విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏఐ జనరేటర్లు ఇటీవల చాలా మెరుగైనప్పటికీ, మనుషుల శరీర భాగాలను రూపొందించేటప్పుడు ఇప్పటికీ చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటాయి. ముఖ్యంగా చేతి వేళ్ల సంఖ్య తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం, వేళ్లు వంకరటింకరగా లేదా ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు కనిపించడం మనం గమనించొచ్చు. అలాగే దూరంగా ఉన్న వ్యక్తుల ముఖాలు మసకబారడం, కళ్లు సరిగ్గాల లేకపోవడం లేదా పళ్ల ఆకారంలో తేడాలు ఉంటే అది ఏఐఫోటో కావడానికి ఎక్కువ అవకాశం ఉంది.
అసలు ఫోటోలో సూర్యకాంతి లేదా లైటింగ్ ఏ దిశలో ఉంటే.. వస్తువుల నీడలు కూడా సరిగ్గా అదే దిశలో పడతాయి. కానీ ఏఐ ఫోటోలో ఒక వస్తువుకు ఒక వైపు నీడ ఉంటే, పక్కనున్న మరో వస్తువుకు వేరే వైపు నీడ ఉండటం లేదా అసలు నీడలే లేకపోవడం కనిపిస్తుంది. కళ్లద్దాలు, అద్దాలు, నీరు లేదా మెరిసే వస్తువులపై కనిపించే ప్రతిబింబాలు కూడా వాస్తవానికి భిన్నంగా, అస్పష్టంగా ఉంటే జాగ్రత్తపడాలి.
ఫోటోలో ఏదైనా సైన్ బోర్డు, బట్టలపై అక్షరాలు, పుస్తకాలు లేదా బ్రాండ్ లోగోలు ఉంటే.. వాటిని జూమ్ చేసి చూడండి.ఏఐ ఫోటో అక్షరాలు అర్థం లేకుండా వంకరగా ఉండటం, స్పెల్లింగ్ తప్పులు రావడం తరచుగా జరుగుతుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కిటికీలు, కంచెలు, భవనాల గీతలు వంకరగా పోవడం లేదా అర్థం లేని ఆకృతులు కనిపించడం కూడా నకిలీ ఫోటోలకు బలమైన సంకేతం.
చాలా ఏఐ ఫోటోల్లో మనుషుల చర్మం ఎలాంటి రంధ్రాలు , సహజమైన ముడతలు లేకుండా నునుపుగా కనిపిస్తుంది. రంగులు కూడా అవసరానికి మించి ప్రకాశ వంతంగా, సినిమాటిక్‌గా ఉండటం మనం గమనించొచ్చు. ఏదైనా సంఘటన లేదా ప్రకృతిని చూసేటప్పుడు “ఇది నిజంగా ఇలా జరిగే అవకాశం ఉందా?” అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. అతిశయోక్తితో ఏఐ ఫోటోలను ఈజీగా పసిగట్టవచ్చు.
Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!
సోషల్ మీడియాలో.. వచ్చే ఫేక్ ఫోటోలను ఆధారం చేసుకుని జరిగే ఆన్లైన్ స్కామ్‌లు, ఫేక్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద ఫోటోల మూలాన్ని చెక్ చేయడానికి గూగుల్ లెన్స్ లేదా రివర్స్ ఇమేజ్ సెర్చ్ వంటి వాటిని ఉపయోగించొచ్చు. కొందరు క్రియేటర్స్, సంస్థలు ఫోటో ఎడిటింగ్, ఏఐ డిటెక్షన్ లేదా క్లౌడ్ స్టోరేజ్ కోసం పెయిడ్ యాప్స్ లేదా సబ్స్క్రిప్షన్లను వాడుతుంటారు. మార్కెట్లో ఇలాంటి డిజిటల్ టూల్స్, ప్లాన్ల ధరలు ఫీచర్లు, ప్రాంతాన్ని బట్టి ఫ్రీ లేదా నెలకు రూ.500 రూ.2,500+ వరకు (లేదా ఇయర్ ప్లాన్ల రూపంలో) మారుతుంటాయి.
ప్రతి ఫోటోను గుడ్డిగా నమ్మకుండా, వేళ్లు, నీడలు, అక్షరాలు, చర్మం తత్వాన్ని గమనించే అలవాటు చేసుకుంటే ఏఐ ఫోటోల ద్వారా జరిగే మోసాల నుంచి ఈజీగా బయటపడొచ్చు