Blue Box Season 2 OTT : స్కూల్లో ప్రతిరోజూ కనిపించే క్రష్‌తోనే ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే… మనసులో దాచుకున్న ప్రేమను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. తైకి జీవితంలోనూ అదే జరుగుతుంది. బ్యాడ్మింటన్ కోర్టులో తన సత్తా చూపించడంతో పాటు, తనకు ఎంతో ఇష్టమైన చినాట్సుకు దగ్గరవుతున్న కొద్దీ అతని మనసులోని భావాలు మరింత బలపడతాయి. కానీ ప్రేమను బయటపెట్టలేని పరిస్థితి, స్పోర్ట్స్‌లో ఎదురయ్యే సవాళ్లు, కొత్తగా జీవితంలోకి వచ్చే వ్యక్తులు అతని ప్రయాణాన్ని మరింత కష్టంగా మారుస్తాయి. టీనేజ్ ప్రేమ, స్పోర్ట్స్, ఫ్రెండ్‌షిప్ వంటి యూత్ మెచ్చే అంశాలతో సాగే యూత్‌ఫుల్ అనిమే సిరీస్ ‘బ్లూ బాక్స్ సీజన్ 2’ (Blue Box Season 2). మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అసలు స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం.
తైకి ఇనోమాటా ఎయిమీ హై స్కూల్ లో చదువుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్. అదే స్కూల్లో బాస్కెట్ బాల్ ఆడే చినాట్సు కానో అంటే అతనికి చాలా ఇష్టం. తైకి ప్రేమ ఒక్కరోజులో పుట్టింది కాదు. ప్రతిరోజూ జిమ్‌లో ఆమెను చూసే కొద్దీ ఆమెపై అతని అభిమానం ప్రేమగా మారుతుంది. అయితే చినాట్సు తనకంటే సీనియర్ కావడంతో ఆమె ముందు తన మనసులోని మాట చెప్పడానికి తైకి వెనుకడుగు వేస్తుంటాడు. వీళ్ల మధ్య దూరం తగ్గడానికి కారణమైన విషయం మాత్రం ఊహించనిది. చినాట్సు కుటుంబ పరిస్థితుల కారణంగా తైకి ఇంట్లో ఉండాల్సి వస్తుంది.
దీంతో స్కూల్లో దూరం నుంచి చూసే అమ్మాయి ఒక్కసారిగా తన ఇంట్లోనే కనిపించే వ్యక్తిగా మారుతుంది. ఒకే ఇంట్లో ఉంటూ కూడా తమ సంబంధాన్ని సాధారణంగానే ఉంచుకోవాల్సిన పరిస్థితి తైకికి మరింత ఇబ్బందిగా మారుతుంది. అదే సమయంలో తైకి తన బ్యాడ్మింటన్ కెరీర్‌పైనా దృష్టి పెట్టాలి. చినాట్సు తన బాస్కెట్‌బాల్ లక్ష్యాన్ని అందుకోవడానికి కష్టపడుతుంది. ఇద్దరూ తమ తమ రంగాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారి మధ్య ఉన్న అనుబంధం కూడా నెమ్మదిగా మారుతుంది. బయటకు చెప్పని భావాలు చిన్న చిన్న సంఘటనల్లో కనిపిస్తూ ఉంటాయి.
ఈ సమయంలో యుమేకా ఎంట్రీ కథను మరో మలుపు తిప్పుతుంది. తైకి గతంతో సంబంధం ఉన్న ఆమె రాకతో అతని వ్యక్తిగత భావోద్వేగాలు బయటపడే పరిస్థితి వస్తుంది. చినాట్సు కూడా తైకి జీవితంలో తన స్థానాన్ని అర్థం చేసుకునే దశకు చేరుకుంటుంది. తైకి తన మనసులో ఉన్న ప్రేమను చినాట్సుకు చెప్పగలడా ? యుమేకా రాకతో వీళ్ల బంధం ఎటు వెళ్తుంది ? స్పోర్ట్స్ లో గెలవాలనే తైకి కలకు ప్రేమ అడ్డంకిగా మారుతుందా ? ఈ భావోద్వేగాల మధ్యే ‘బ్లూ బాక్స్ సీజన్ 2’ (Blue Box Season 2) కథ ఆసక్తికరంగా సాగుతుంది.
Also Read : లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్
‘బ్లూ బాక్స్ సీజన్ 2’ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జపనీస్ ఒరిజినల్ తో పాటు ఇంగ్లీష్ ఆడియో అందుబాటులో ఉంది. యుమే మియాషిత (Yuma Uchida), షోయా చిబా (Shōya Chiba), రెనా ఉఎదా (Reina Ueda) తదితరులు మెయిన్ లీడ్స్ కి వాయిస్ అందించారు.