Questions to ask before hiring a Babysitter| చిన్నారిని మరొకరి చేతిలో పెట్టి వెళ్లాలంటే తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు కలుగుతాయి. ముఖ్యంగా బిడ్డను ఆయా జాగ్రత్తగా చూసుకుంటుందా? సమయానికి ఆహారం పెడుతుందా? అనుకోకుండా బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా స్పందిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు ప్రతి తల్లిదండ్రిని ఆందోళనకు గురిచేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే తల్లిదండ్రులకు ఇంట్లో ఆయా సహాయం ఎంతో అవసరం. అయితే, బిడ్డ సంరక్షణ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయాని నియమించే ముందు ఆమె అనుభవం, ప్రవర్తన, బాధ్యతలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా ఈ 5 ప్రశ్నలు అడగండి.
ఆయాని నియమించే ముందు ఆమెకు పిల్లలను చూసుకోవడంలో ఎంత అనుభవం ఉందో తెలుసుకోండి. గతంలో ఎంతమంది పిల్లలను చూసుకున్నారు? వారి వయసు ఎంత? ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? వంటి ప్రశ్నలు అడగండి. అప్పుడే మీ బిడ్డ అవసరాలకు తగిన సంరక్షణ అందించగలరా లేదా అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆహారం పెట్టడం, నిద్రపుచ్చడం వంటి విషయాల్లో ఆమెకు అవగాహన ఉందో లేదో తెలుసుకోండి.
ఆయా గతంలో పనిచేసిన చోటు, ఉద్యోగం వదిలేయడానికి గల కారణాలను అడగండి. ఆమె గత యజమానుల వివరాలు తీసుకుని, వారి అనుమతితో మాట్లాడండి. ఆమె పని తీరు, ప్రవర్తన గురించి తెలుసుకోండి. గుర్తింపు పత్రాలు, చిరునామాను తగిన విధంగా ధృవీకరించండి. అవసరాన్ని బట్టి పోలీస్ వెరిఫికేషన్ కూడా చేయించండి. ఏదైనా ఏజెన్సీ ద్వారా నియమిస్తున్నట్లయితే, వారు ఎలాంటి నేపథ్య తనిఖీలు చేశారో అడగండి.
పిల్లలు ఎప్పుడైనా అనారోగ్యానికి గురవచ్చు లేదా గాయపడవచ్చు. అలాంటి సమయంలో ఆయా ఎలా స్పందిస్తారో ముందుగానే తెలుసుకోండి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు, వైద్యులకు ఎలా సమాచారం ఇస్తారో అడగండి. బిడ్డకు అలర్జీలు లేదా ఇతర ప్రత్యేక అవసరాలు ఉంటే వివరించండి. ప్రథమ చికిత్స, పిల్లలకు సంబంధించిన అత్యవసర శిక్షణ పొందిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వండి.
ఆయా బాధ్యతలను ముందుగానే స్పష్టంగా చెప్పండి. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, నిద్రపుచ్చడం, ఆడించడం వంటి పనులు చేస్తారా అని అడగండి. పిల్లలను బయటకు తీసుకెళ్లడం, స్క్రీన్ టైమ్ నియంత్రించడం వంటి విషయాలపై కూడా మాట్లాడండి. పని వేళలు, జీతం, సెలవులు వంటి అంశాలను ముందుగానే నిర్ణయించుకోండి.
Also Read: చాణక్య నీతి.. మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మగా మారిందా? ఈ తప్పుడు అలవాట్లే కారణం
పిల్లలు ఏడ్చినా, అల్లరి చేసినా ఆయా ఎలా స్పందిస్తారో తెలుసుకోండి. పిల్లలను కొట్టడం, బెదిరించడం, అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. ప్రేమగా, ఓపికగా పిల్లలను చూసుకోవాలని స్పష్టంగా చెప్పండి. మొదట్లో ఆయాతో బిడ్డ ఎలా కలిసిపోతున్నాడో గమనించండి.
Also Read: తాతల ఆస్తి రెండో భార్యకు రాసిచ్చిన భర్త.. కోర్టుకెక్కిన మొదటి భార్య కూతురు.. చివరికి ఏం జరిగిందంటే
ఆయాని నియమించిన తర్వాత కూడా ఆమెతో క్రమం తప్పకుండా మాట్లాడండి. బిడ్డ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వాటిని గమనించండి. సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం ద్వారా మీ బిడ్డకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవచ్చు.