Heart Attack: ప్రస్తుతం చిన్న వయస్సులోనే చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. గతంలో వయస్సు పైబడిన వారు మాత్రమే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు. కానీ ప్రస్తుతం చిన్న పెద్దా తేడా లేకుండా హార్ట్ ఎటాక్స్ బారిన పడుతున్నారు. లైఫ్ స్టైల్ మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లతో పాటు కొన్ని రకాల కారణాలు చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
1. లైఫ్ స్టైల్ మార్పులు :
సమయానికి తినకపోవడం: ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వులు, ఎక్కువ చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, కూరగాయలు, పండ్లు తక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెపోటుకు కూడా దారితీస్తుంది.
శారీరక శ్రమ లేకపోవడం: ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి గుండెపోటు ప్రమాద కారకాలను పెంచుతుంది.
నిద్ర లేకపోవడం: నిద్రలేమి, క్రమరహిత నిద్ర గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఒత్తిడి హార్మోన్లను పెంచుతాయి.
2. అధిక ఒత్తిడి, ఆందోళన:
ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు యువతలో పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలకు దారితీస్తుంది. ఇవి రక్తపోటును పెంచి.. గుండెపై భారాన్ని పెంచుతాయి. అంతే కాకుండా ఆందోళన, డిప్రెషన్ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
3. స్మోకింగ్ , డ్రింకింగ్:
స్మోకింగ్: పొగ తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి. అంతే కాకుండా రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటుకు దారితీస్తుంది.
ఎక్కువగా మద్యం తీసుకోవడం: అధికంగా మద్యం తాగడవం వల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండె కండరాలు బలహీనపడతాయి.ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
4. అనారోగ్యకరమైన అలవాట్లు:
కొకైన్, యాంఫెటమైన్‌లు వంటి డ్రగ్స్ తీసుకోవడం గుండెపోటుకు ప్రత్యక్ష కారణం కావచ్చు. ఇవి గుండె లయను అస్తవ్యస్తం చేసి.. రక్తనాళాలను తీవ్రంగా సంకోచింపజేసి గుండెపోటుకు దారితీస్తాయి.
5. దీర్ఘకాలిక వ్యాధులు:
యువతలో పెరుగుతున్న కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.
అధిక రక్తపోటు: నియంత్రించలేని అధిక రక్తపోటు రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి.. వాటిని దెబ్బతీస్తుంది.
మధుమేహం: అధిక రక్త చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీసి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
అధిక కొలెస్ట్రాల్: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తనాళాల్లో ఫలకాలు పేరుకుపోయి.. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.
స్థూలకాయం: అధిక బరువు గుండెపై భారాన్ని పెంచి.. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
Also Read: హైబీపీ ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
6. కుటుంబ చరిత్ర, జన్యుపరమైన కారకాలు:
కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే.. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు లేదా రక్తం గడ్డకట్టే పరిస్థితిని ప్రభావితం చేస్తాయి.
7. నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం:
యువత తరచుగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తారు. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను అజీర్తిగా లేదా అలసటగా పొరపాటు పడతారు. దీనివల్ల సమయానికి చికిత్స అందక పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా చాలా వరకు పెరుగుతుంది.