Easy Cheesy Pasta Making at Home: పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్ట పడే వంటకాల్లో పాస్తా ముందు వరుసలో ఉంటుంది. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు.. లేదా కేఫ్‌లలో కూర్చున్నప్పుడు క్రీమీగా, చీజీగా ఉండే వైట్ సాస్ పాస్తాను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. అయితే.. అదే రుచిని, అంతకంటే ..శుభ్రంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హోటల్ స్టైల్‌లో నోట్లో వేస్తే కరిగి పోయేలా ఉండే.. చీజ్ పాస్తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 10 నిమిషాల్లో చిటికెలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాస్తా: 1 కప్పు (పెన్నే లేదా మ్యాకరోని ఏ రకమైనా పర్వాలేదు)
బటర్ : 2 టేబుల్ స్పూన్లు
మైదా పిండి: 2 టేబుల్ స్పూన్లు
పాలు: 1.5 కప్పులు
వెల్లుల్లి రెబ్బలు: 4-5 (సన్నగా తరిగినవి)
చీజ్ (మొజారెల్లా లేదా చీజ్ క్యూబ్స్): అర కప్పు
చిల్లీ ఫ్లేక్స్: 1 టీస్పూన్
ఆరిగానో : 1 టీస్పూన్
మిరియాల పొడి: అర టీస్పూన్
కూరగాయలు: క్యాప్సికం, క్యారెట్, స్వీట్ కార్న్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 స్పూన్
1.ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి మరగబెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న.. పాస్తాను అందులో వేసి సుమారు 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. పాస్తా పూర్తిగా.. మెత్తగా కాకుండా 80 శాతం ఉడికితే సరి పోతుంది. ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, పాస్తాపై కొద్దిగా చల్లటి నీరు పోస్తే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటాయి.
2.ఇప్పుడు మరో ప్యాన్‌లో ఒక స్పూన్ బటర్ వేసి కరిగించాలి. అందులో.. సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. వెల్లుల్లి మంచి సువాసన రాగానే, సన్నగా తరిగిన క్యాప్సికం, క్యారెట్ , స్వీట్ కార్న్ వేసి మీడియం మంటపై రెండు నిమిషాల పాటు మగ్గించాలి. కూరగాయలు మరీ ఎక్కువగా ఉడికిపోకూడదు, కొద్దిగా క్రిస్పీగా ఉంటేనే.. పాస్తాలో తినేటప్పుడు రుచిగా ఉంటాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇదే ప్యాన్‌లో మరో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేయాలి. బటర్ కరిగిన తర్వాత మైదా పిండిని ..వేసి తక్కువ మంటపై పచ్చి వాసన పోయే …వరకు నిదానంగా కలుపుతూ వేయించాలి. మైదా రంగు మారకుండా చూసుకోవాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి, గోరు వెచ్చని పాలను కొద్ది కొద్దిగా పోస్తూ.. ఉండలు కట్టకుండా వేగంగా కలుపుకోవాలి. పాలు మొత్తం పోసిన తర్వాత సాస్ చిక్కబడుతుంది.
Also Read: ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి..దొండకాయ ఉల్లికారం ఇలా ట్రై చేయండి!
4. సాస్ చిక్కబడిన తర్వాత.. ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయలు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, రుచికి సరి పడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న చీజ్‌ను ఇందులో కలపాలి. చీజ్ కరిగి సాస్‌లో పూర్తిగా కలిసి పోయిన తర్వాత క్రీమీ టెక్చర్ వస్తుంది.
5. చివరగా మనం ఉడక బెట్టి పక్కన పెట్టుకున్న పాస్తాను ఈ వైట్ సాస్ మిశ్రమంలో వేయాలి. పాస్తా అంతా సాస్‌ని పీల్చుకునేలా సుమారు రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. అంతే.. గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ క్రీమీ చీజ్ పాస్తా సర్వ్ చేయడానికి రెడీ! వేడి వేడిగా తింటే దీని రుచి వేరు లెవెల్ ఉంటుంది.