Smartphone pinky syndrome: రోజంతా చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా నిమిషం కూడా గడవట్లేదా? రీల్స్ స్క్రోల్ చేయడం, చాటింగ్, గేమింగ్… ఇలా ప్రతి దానికీ ఫోన్‌ను సపోర్ట్ చేయడానికి చిటికిన వేలుపైనే బరువు పెడుతున్నారా? అయితే.. మీరు ‘పింకీ ఫింగర్ సిండ్రోమ్’ బారిన పడే అవకాశం ఉంది! మనం ఫోన్ పట్టుకునే స్టైల్ వల్ల చిటికిన వేలిపై విపరీతమైన ఒత్తిడి పడి నొప్పి, ఉబ్బరం, చివరకు వేలు ఆకారం మారడం వంటి సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ సిండ్రోమ్ ఏంటి? మొబైల్ యూజర్లు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం!”
మనం సాధారణంగా ఒక చేత్తో ఫోన్ వాడుతున్నప్పుడు, ఫోన్ కింద పడిపోకుండా ఉండటానికి మన వేళ్లను ఫోన్ బేస్ కింద సపోర్ట్‌గా పెడతాం. ఇప్పటి స్మార్ట్‌ఫోన్‌లు సైజులో పెద్దగా, బరువుగా ఉండటం వల్ల, ఆ బరువంతా ఒక్క చిటికిన వేలిపైనే ఎక్కువగా పడుతుందట. ఇలా గంటల తరబడి ఇలాగే ఫోన్ పట్టుకోవడం వల్ల చిటికిన వేలిలోని కండరాలు, నరాలు, జాయింట్లపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనినే టెక్నాలజీ భాషలో ‘పింకీ ఫింగర్ సిండ్రోమ్’ లేదా ‘స్మార్ట్‌ఫోన్ పింకీ’ అని పిలుస్తున్నారు.
దీని ప్రధాన లక్షణాలు:
నొప్పి , మొద్దుబారడం: చిటికిన వేలు లేదా దాని పక్కన ఉండే ఉంగరపు వేలిలో నిరంతరం నొప్పి, మంట లేదా వేళ్లు మొద్దుబారినట్లు అనిపించడం.
కండరాల బలహీనత: చేతి వేళ్లతో ఏదైనా వస్తువును గట్టిగా పట్టుకోవడంలో ఇబ్బంది కలగడం.
వాపు , నొప్పి: చిటికిన వేలి జాయింట్ల వద్ద వాపు రావడం, ఒత్తిడి పెరిగినప్పుడు తీవ్రమైన నొప్పి రావడం.
ఆకారంలో మార్పు: నిరంతరం ఫోన్ బరువు పడటం వల్ల వేలి కణజాలంపై ఒత్తిడి పడి తాత్కాలికంగా ఒక చిన్న గుంట లేదా వంపు ఏర్పడటం.
ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?
పట్టుకునే పద్ధతి :
ఫోన్‌ను కేవలం ఒక్క చేత్తో పట్టుకుని చిటికిన వేలిపై బరువు పెట్టడం మానేయండి. రెండు చేతులను ఉపయోగించి ఫోన్ పట్టుకోవడం లేదా ఫోన్ వెనుక గ్రిప్ హోల్డర్ వాడటం వల్ల బరువు సమానంగా పంపిణీ అవుతుంది.
Also Read: రూ.11,500 వేలకే 32 ఇంచుల టీవీ..స్టాక్ అయిపోయేలోపే కొనేయండి
ఫోన్ వాడకానికి గ్యాప్ ఇవ్వండి:
వరుసగా గంటల తరబడి స్క్రోలింగ్ చేయకండి. ప్రతి 20-30 నిమిషాలకు ఒకసారి ఫోన్‌ను పక్కన పెట్టి చేతులకు, వేళ్లకు కాసేపు గ్యాప్ ఇవ్వండి.
చేతి వేళ్లకు స్ట్రెచింగ్స్ చేయండి:
రోజూ కొద్దిసేపు చేతి వేళ్లను చాచడం, మడవటం, అరచేతిని క్లాక్‌వైజ్, యాంటీ-క్లాక్‌వైజ్ తిప్పడం వంటి చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. ఇది రక్తాన్ని బాగా సరఫరా చేస్తుంది.
వాయిస్ మెసేజ్‌లు, స్టాండ్స్ :
పెద్ద మెసేజ్‌లు టైప్ చేయడానికి బదులు వాయిస్ టైపింగ్ లేదా వాయిస్ మెసేజ్‌లు వాడండి. వీడియోలు చూసేటప్పుడు మొబైల్ స్టాండ్ ఉపయోగించడం బెస్ట్.
ఐస్ ప్యాక్ మసాజ్:
వేలి వద్ద వాపు లేదా నొప్పి ఎక్కువగా ఉంటే కొద్దిసేపు ఐస్ ప్యాక్ తో మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది.