Masala Dalia Recipe: రోజూ ఉదయాన్నే ఒకే రకమైన టిఫిన్లు తిని బోర్ కొట్టేసిందా? ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు రోజూ పాలు, చక్కెర వేసి చేసే తీపి గోధుమ రవ్వ (దలియా) తిని విసిగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన, నోరూరించే రెసిపీ గురంచి ఇప్పుడు తెలుసుకుందాం. అదే వేడివేడిగా, కారంగా ఉండే వెజిటబుల్ మసాలా దలియా. కూరగాయలు, ప్రోటీన్, మసాలాలు అన్నీ కలిపి చేసే ఈ వంటకం ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ వండుకుని తింటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు అయినా, సాయంత్రం పూట లైట్ డిన్నర్‌కు అయినా ఇది బెస్ట్ ఆప్షన్. పైగా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.
ఈ స్పైసీ దలియా తయారు చేసుకోవడానికి ఒక కప్పు గోధుమ రవ్వ (దలియా), ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టమాటా, అర కప్పు పచ్చి బఠానీలు, ఒక క్యారెట్, ఒక చిన్న క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు తీసుకోవాలి. మసాలాల కోసం అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు సిద్ధం చేసుకోవాలి. ఉడికించడానికి మూడు కప్పుల నీళ్లు, తాలింపు కోసం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి అవసరం. ప్రోటీన్ ఇంకాస్త ఎక్కువ కావాలనుకునేవారు కొద్దిగా పనీర్ ముక్కలను కూడా కలుపుకోవచ్చు.
Also Read: పాల ప్యాకెట్‌పై ‘పాశ్చరైజ్డ్’ అని ఉంటే అర్థం ఏంటి? ఇది తెలిస్తే ఇకపై పాలను మళ్లీ మరగబెట్టరు!
స్టవ్ మీద కుక్కర్ లేదా పాన్ పెట్టి, గోధుమ రవ్వను చిన్న మంటపై లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేయాలి.
జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా, క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ కూరగాయలకు పట్టిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ, పనీర్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు కలపాలి.
ఆ తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి. మీడియం మంటపై రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడాలి.
ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే.. కొద్దిగా వేడి నీళ్లు పోసి కాసేపు ఉడికించుకోవచ్చు. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేడివేడిగా పెరుగు, రైతా లేదా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే పైన కాస్త నిమ్మరసం పిండుకుంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
Also Read: Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి రోజున ఈ శుభ సమయంలో దీపం వెలిగిస్తే సకల శుభాలు మీవే!