Cabbage roti pachadi recipe: రోజూ తినే కూరలతో బోరు కొట్టిందా? వేడి వేడి అన్నంలోకి లేదా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లలోకి అద్భుతంగా సరిపోయే కమ్మటి పచ్చడి కావాలా? అయితే మీకోసమే.. క్యాబేజీతో చేసే రుచికరమైన రోటి పచ్చడి. సాధారణంగా క్యాబేజీ అంటే చాలా మంది పిల్లలు, పెద్దలు ముఖం చాటేస్తుంటారు. కానీ ఇలా పచ్చడి చేసి పెడితే మాత్రం ప్లేట్లు ఇట్టే ఖాళీ అయిపోతాయి. మరి ఆ కమ్మటి రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
సన్నగా తరిగిన క్యాబేజీ తరుగు – 2 కప్పులు
పచ్చిమిరపకాయలు – 6 నుంచి 8
టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
చింతపల్లి – చిన్న నిమ్మకాయ సైజ్ అంత
వెల్లుల్లి రెబ్బలు -6 లేదా 7
జీలకర్ర – 1 స్పూన్
శనగపప్పు, మినప్పప్పు – 1 స్పూన్ చొప్పున
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
1.ఈ క్యాబేజీ రోటి పచ్చడిని చాలా తక్కువ సమయంలోనే.. ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా.. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తరుగును వేసి, మంటను మీడియం సైజులో.. ఉంచి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. క్యాబేజీ పూర్తిగా.. మగ్గి కొద్దిగా మెత్తబడే వరకు వేయించడం ముఖ్యం. ఆ తర్వాత తరిగిన టమాటా ముక్కలు, చింతపండు వేసి, టమాటాలు గుజ్జులా మారేంత వరకు బాగా మగ్గనివ్వాలి. చివరగా.. కొద్దిగా కొత్తి మీర వేసి స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టాలి.
Also Read: ఏడాది నిల్వ ఉండే.. పండు మిరపకాయ పచ్చడి పక్కా కొలతలతో!
2.పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని రోట్లో నూరుకుంటే.. ఆ రుచే వేరు. అయితే.. నేటి బిజీ లైఫ్‌లో రోటిలో నూరే సమయం లేక పోతే మిక్సీ జార్‌లో వేసుకోవచ్చు. మిక్సీలో వేసే టప్పుడు మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా, కొద్దిగా బరకగా (కచ్చాపచ్చాగా) గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే.. రోటి పచ్చడి అసలైన రుచి వస్తుంది.చివరగా రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. పచ్చడికి మరింత కమ్మదనాన్ని తీసుకురావడానికి పోపు పెట్టుకోవడం చాలా ముఖ్యం. చిన్న కడాయిలో.. కొద్దిగా నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి చిటపటలాడించాలి.ఈ తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న క్యాబేజీ పచ్చడిలో.. కలిపి బాగా కలపాలి. అంతే..ఘుమఘుమలాడే కమ్మటి క్యాబేజీ రోటి పచ్చడి రెడీ!
వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ క్యాబేజీ పచ్చడి కలుపుకొని.. తింటుంటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. అలాగే.. ఉదయం పూట ఇడ్లీ, దోశ లేదా వడల్లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి.