Food To Avoid At Weddings| పెళ్లిళ్లు, పార్టీలకు వెళితే అక్కడ రకరకాల రుచికరమైన వంటకాలు చూసి అన్నీ తినేయాలనిపిస్తోంది. అలాగే ప్రయాణాల్లో ఆకలేస్తే ఎయిర్‌పోర్టులో శాండ్‌విచ్, పిజ్జాలు తింటాం. ఆఫీస్ పార్టీల్లో స్నాక్స్, స్వీట్లు లాగించేస్తాం. అయితే ఈ ఆహారాలన్నీ మన ఆరోగ్యానికి మంచివేనా? ఆహారం సరిగ్గా నిల్వ చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ తినకూడదని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ విషయంలో ఢిల్లీకి చెందిన ధర్మశిలా నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పని చేసే జీర్ణకోశ శస్త్రచికిత్స జీర్ణకోశ క్యాన్సర్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కపిల్ కుమార్ కుర్సివాల్ కొన్ని సూచనలు చేశారు.
ప్రయాణ సమయంలో చికెన్, గుడ్డు, మయోనైస్‌తో తయారుచేసిన శాండ్‌విచ్‌లు సులభంగా లభిస్తాయి. అయితే వీటిని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌లో ఆహారాన్ని 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి. పాడయ్యే అవకాశం ఉన్న ఆహారాన్ని రూం టెంరేచర్‌లో రెండు గంటలకు మించి ఉంచకూడదు. ఉష్ణోగ్రత 32 డిగ్రీలు దాటితే ఈ సమయం గంటకు తగ్గుతుంది.
అందుకే నమ్మకమైన దుకాణాల్లో తాజాగా తయారుచేసిన ఆహారాన్ని ఎంచుకోవాలి. వీలైనంత వరకు పండ్లు, ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. వేయించిన పదార్థాలు, చక్కెర పానీయాలను తగ్గించాలి.
పెళ్లి విందుల్లో రకరకాల వంటకాలు ఆకర్షిస్తాయి. అయితే ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు.
ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచని పాల పదార్థాలు, క్రీమీ స్వీట్లు, కట్ చేసిన పండ్లు, పచ్చి సలాడ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కలుషితమైన ఆహారం చూడటానికి, వాసనకు సాధారణంగానే కనిపించవచ్చు. కానీ వీటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ.
ముందుగా బఫేలో ఉన్న వంటకాలను పరిశీలించాలి. ఆహారం ఎంత రుచికరంగా ఉన్నా పరిమితంగా తినాలి. కూరగాయలు, ప్రోటీన్ ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆఫీస్ పార్టీల్లో పకోడీలు, స్ప్రింగ్ రోల్స్, ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల అధిక కేలరీలు శరీరంలో చేరుతాయి.
సాసేజీలు, సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాల్లో ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పెద్దలు రోజుకు 2,000 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అంటే రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి.
మయోనైస్ తినడం తప్పు కాదు. అయితే దాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయాలి. గుడ్లు, మాంసం, పాల పదార్థాలతో తయారుచేసిన వంటకాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. మిగిలిన ఆహారాన్ని రెండు గంటల్లోపు ఫ్రిజ్‌లో పెట్టాలి. మళ్లీ తినే ముందు పూర్తిగా వేడి చేయాలి. నిల్వ విషయంలో సందేహం ఉంటే ఆ ఆహారాన్ని తినకపోవడమే మంచిది.
Also Read: ఆ దేశంలో అంతా రివర్స్.. ప్రజలకు కరెంట్ బిల్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఎలాగంటే
తాజాగా తయారుచేసిన ఆహారాన్ని ఎంచుకోవాలి. వంట చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉందో లేదో గమనించాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి.
గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
Also Read: రైల్వే స్టేషన్‌లో కూలీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడా? ఇలా ఫిర్యాదు చేయండి
ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అది తాజాగా ఉందా, పరిశుభ్రంగా తయారుచేశారా, సరిగ్గా నిల్వ చేశారా అనే విషయాలు తెలుసుకోవాలి. ఆహార విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్య సమస్యలను చాలావరకు నివారించవచ్చు.