Gutti kakarakaya recipe: కాకరకాయ తినడానికి ఇష్టపడే వారు చాలా తక్కువ మందే ఉంటారు. దీని చేదు స్వభావమే ఇందుకు కారణం కానీ.. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి కారకాయ రెసీపీలు తయారు చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మమ్మల కాలం నాటు గుత్తి కాకరకాయ వంటకం తింటే మాత్రం రుచి ఎప్పటికీ మరచిపోలేరు. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యితో ఈ కర్రీ తింటే అద్భుతం అనాల్సిందే. ఇంతకీ ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
లేత కాకరకాయలు- అర కిలో
వేయించిన పల్లీలు- అర కప్పు
వేయించిన తెల్ల నువ్వులు- రెండు టేబుల్ స్పూన్లు
తరిగిన ఉల్లిపాయ- ఒకటి
వెల్లుల్లి రెబ్బలు- ఆరు నుంచి ఏడు
చింతపండు -చిన్న నిమ్మకాయ సైజు అంత
కారం, ఉప్పు, పసుపు- అర స్పూన్
ధనియాల పొడి- ఒక స్పూన్
జీలకర్ర పొడి- అర స్పూన్
బెల్లం- చిన్న ముక్క
నూనె మూడు- టేబుల్ స్పూన్లు
కాకారకాయల పైనున్న తొక్కను పైపైన తీసి, తర్వాత నిలువుగా వాటికి గాట్లు పెట్టి వాటిలోని గింజలు, గుజ్జు తీసేయాలి. ఆ తర్వాత కాకార కాయ ముక్కలకు కొద్దిగా ఉప్పు. పసుపు పట్టించి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకార కాయలోని చేదు నీరు ద్వారా అంత బయటకు పోతుంది. ఆ తర్వాత కూడా ఒకసారి కాకర కాయలను గట్టిగా పిండితే చేదు చాలా వరకు తగ్గుతుంది. చేదు తగ్గించడానికి కొంతమంది చింతపండు గుజ్జు , బెల్లం కూడా వాడతారు. ఇవి రుచిని మరింత బ్యాలెన్స్ చేస్తాయి.
1.స్టఫ్ కోసం మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, నాన బెట్టిన చింత పండు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బెల్లం ముక్క వేసి కొద్దిగా నీళ్లు లేదా తరిగిన ఉల్లిపాయ చేర్చి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న.. కాకర కాయల లోపల కూర్చాలి. తర్వాత స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా ప్రెస్ చేయాలి.
2.అనంతరం స్టవ్ మీద మంద పాటి కడాయి లేదా పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీల కర్ర, కరి వేపాకు వేసి వేయించాలి. తర్వాత మసాలా కూరిన కాకర కాయలను ఒక్కొక్కటిగా పాన్‌లో పేర్చాలి. మిగిలిపోయిన మసాలా ఉంటే.. పైన చల్లుకోవచ్చు. మూత పెట్టి లో-ఫ్లేమ్‌లో ఐదు నుంచి ఏడు నిమిషాలు మగ్గనివ్వాలి.
Also Read: నోరూరించే పప్పురొయ్య వంకాయ కూర..పాతకాలపు రుచితో సింపుల్,టేస్టీగా!
3. తర్వాత మూత తీసి కాకర కాయలను జాగ్రత్తగా మరోవైపు తిప్పాలి. ముక్కలు విరిగిపోకుండా, మసాలా రాలి పోకుండా నెమ్మదిగా తిప్పడం ముఖ్యం. అవసరమైతే.. రెండు మూడు స్పూన్ల నీళ్లు చిలకరించి మళ్లీ మూత పెట్టి మరో ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించాలి. కాకర కాయలు మెత్తగా ఉడికి, నూనె పైకి తేలి, మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ గుత్తి కాకరకాయ కూర వేడి అన్నం, పప్పు చారు, లేదా జొన్న రొట్టె, చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఈ అమ్మమ్మ స్టైల్ కాకర కాయ రెసిపీ ట్రై చేసి పాతకాలపు రుచిని ఎంజాయ్ చేయండి!