Winter Water Tank Tips: చలికాలం మొదలైందంటే.. ఉదయం స్నానం చేయాలంటేనే చాలామందికి భయం వేస్తుంది. ముఖ్యంగా ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్‌లో నీళ్లు రాత్రికి బాగా చల్లబడిపోతాయి. ఉదయం ఆ నీటితో స్నానం చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో గీజర్ లేని వాళ్లకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. రోజూ ఇమ్మర్షన్ రాడ్ వాడితే కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే.. ట్యాంక్ నీళ్లు త్వరగా చల్లబడకుండా చూసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
వాటర్ ట్యాంక్ ఇంటి పైన లేదా బయట ఉంటే దాని చుట్టూ మందపాటి థర్మాకోల్ షీట్లు అమర్చవచ్చు. థర్మాకోల్ వేడిని బయటకు త్వరగా పోనివ్వదు. అలాగే చల్లని గాలి ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో ట్యాంక్‌లోని నీళ్లు త్వరగా చల్లబడకుండా ఉంటాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ఉపయోగపడే చిట్కా ఇది. అయితే థర్మాకోల్‌ను ట్యాంక్‌కు గట్టిగా అమర్చాలి.
ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ప్యాకింగ్‌లో ఉండే బబుల్ ర్యాప్‌ను చాలామంది పడేస్తుంటారు. కానీ చలికాలంలో ఇది ఉపయోగపడుతుంది. బబుల్ ర్యాప్‌లో ఉండే చిన్న చిన్న గాలి పొరలు వేడిని నిలిపి ఉంచడంలో సహాయపడతాయి. ట్యాంక్ చుట్టూ రెండు మూడు పొరలుగా చుట్టి కవర్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల బయట చల్లని గాలి నేరుగా ట్యాంక్‌ను తాకదు.
Also Read: స్క్రీన్ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!
రాత్రిపూట మంచు, చల్లని గాలి వల్ల ట్యాంక్ నీళ్లు మరింత చల్లబడతాయి. అందుకే ట్యాంక్ పైన చిన్న షెడ్ ఏర్పాటు చేయడం మంచిది. టార్పాలిన్, పాత గోనె సంచులు లేదా మందపాటి గుడ్డతో కూడా కవర్ చేయవచ్చు. అయితే ట్యాంక్ మూత మాత్రం గట్టిగా ఉండాలి. నీటిలోకి దుమ్ము, పురుగులు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
ట్యాంక్ రంగు, అది ఉండే ప్రదేశం కూడా నీటి ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతాయి. నలుపు, ముదురు నీలం వంటి రంగులు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. అలాగే రోజంతా ఎండ తగిలే చోట ట్యాంక్ ఉంటే పగటిపూట నీరు కొంత వెచ్చబడే అవకాశం ఉంటుంది. రాత్రిపూట మందపాటి కవర్ వేస్తే వేడి త్వరగా తగ్గకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. దీంతో ఉదయాన్నే నీళ్లు మరీ చల్లగా ఉండకుండా గోరువెచ్చగా వస్తాయి.