Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకునే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చే సులభమైన వ్యాయామం నడక. ఎలాంటి ఖర్చు లేకుండా.. అన్ని వయసుల వారు చేయగలిగే ఈ వ్యాయామం మన కీళ్లపై ఎలాంటి ఒత్తిడి పడకుండా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సాధారణంగా రోజుకు 10 వేల అడుగులు నడవాలని అందరూ చెబుతుంటారు. అయితే, కేవలం వారం రోజుల్లో ఒక కిలో బరువు తగ్గాలంటే అసలు ఎన్ని అడుగులు వేయాలి అనే విషయంపై చాలా మందికి స్పష్టత ఉండదు.
మన శరీరంలో ఒక కిలో బరువు తగ్గాలంటే సుమారు 7,700 క్యాలరీలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే వారం రోజుల్లో కిలో తగ్గాలంటే.. ప్రతిరోజూ దాదాపు 1,100 క్యాలరీల లోటును మనం సృష్టించాలి. సాధారణంగా ఒక వ్యక్తి వెయ్యి అడుగులు నడిస్తే 40 నుండి 50 క్యాలరీలు కరుగుతాయి. ఈ లెక్క ప్రకారం కేవలం నడక ద్వారానే వారంలో కిలో తగ్గాలంటే, రోజుకు 22,000 నుండి 27,500 అడుగులు నడవాలి. అంటే వారం మొత్తంలో దాదాపు లక్షన్నర నుండి రెండు లక్షల అడుగుల వరకు వేయాల్సి ఉంటుంది.
రోజుకు 20 వేలకు పైగా అడుగులు నడవటం అనేది ప్రాక్టికల్‌గా చాలా కష్టమైన పని. అంత ఎక్కువగా నడవటం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగి, కండరాల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల రెండు మూడు రోజులకే అలసిపోయి, నడకను మధ్యలోనే ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గే క్రమంలో వేగం కంటే నిలకడగా వ్యాయామం చేయడమే చాలా ముఖ్యం.
Also Read: సిమ్ కార్డ్ పోతే ఏం చేయాలి? పాత నంబర్ మారకుండా కొత్త సిమ్ తీసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఇదే!
కేవలం నడకపైనే ఆధారపడకుండా.. మనం తీసుకునే ఆహారంలో రోజుకు ఒక 500 క్యాలరీలు తగ్గించుకుంటే పని చాలా సులభమవుతుంది. డైట్ కంట్రోల్ చేయడం వల్ల మీ రోజువారీ నడక లక్ష్యం 12,000 నుండి 15,000 అడుగులకు తగ్గుతుంది. లేదా రోజుకు 10 నుండి 12 వేల అడుగులు నడుస్తూ.. 10 నుండి 15 రోజుల్లో ఒక కిలో తగ్గేలా ప్లాన్ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం.
నడిచేటప్పుడు మామూలుగా కాకుండా కొంచెం వేగంగా నడవటం వల్ల ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఒకేసారి గంటసేపు నడవలేని వారు, రోజులో మూడుసార్లు 20 నిమిషాల చొప్పున నడవచ్చు. మొదటి రోజే వేల అడుగులు వేయకుండా, వారానికి పది శాతం చొప్పున అడుగుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి. నడకతో పాటు తగినంత నీరు తాగడం, కండరాల విశ్రాంతి కోసం రోజుకు 7 నుండి 9 గంటలు నిద్రపోవడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.