Red line on medicine: సాధారణంగా మనం మెడికల్ షాపులో..మందులు కొనేటప్పుడు ముందుగా చూసేది తయారీ తేదీ, గడువు తేదీ మాత్రమే. ఈ సమయంలో ఎక్స్‌పైరీ డేట్ ఇంకా చాలా రోజులు ఉందని నిర్ధారించుకుని మందులు ఇంటికి తెచ్చుకుంటాం. కానీ చాలా మంది టాబ్లెట్ స్ట్రిప్ లేదా మందుల ప్యాక్ మీద నిలువుగా ఉండే ఒక ఎర్రటి పట్టీని అస్సలు పట్టించుకోరు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. ఆ ఎర్రటి గీతకు చాలా పెద్ద అర్థం ఉంది. మందులు కొనే ముందు దాన్ని గమనించడం ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మన దేశంలో జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు రాగానే.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి మందులు తెచ్చుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. పాత ప్రిస్క్రిప్షన్ చూపించో.. లేదా తెలిసిన టాబ్లెట్ పేరు చెప్పో మందులు వేసుకుంటుంటారు. ఇలాంటి సెల్ఫ్ మెడికేషన్ అలవాటు వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టడానికి భారత ప్రభుత్వ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అలాగే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మందుల ప్యాకేజింగ్‌పై ఒక ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చాయి. అదే ట్యాబ్లెట్ స్ట్రిప్‌పై ఎర్రటి నిలువు పట్టీ.
ఏదైనా టాబ్లెట్ స్ట్రిప్, క్యాప్సూల్ షీట్ లేదా మందుల బాక్స్‌పై ఎరుపు రంగులో నిలువు గీత కనిపిస్తే.. అది సాధారణ ఓవర్-ది-కౌంటర్ మందు కాదని అర్థం. ఔషధ నియంత్రణ చట్టంలోని షెడ్యూల్ H, H1 లేదా X పరిధిలోకి వచ్చే ప్రిస్క్రిప్షన్ మందులకు మాత్రమే ఈ ఎర్రటి పట్టీని ముద్రిస్తారు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, నిద్ర మాత్రలు, తీవ్రమైన వ్యాధులకు వాడే మందులపై ఈ గుర్తు ఉంటుంది.
ఎర్రటి పట్టీ ఉన్న మందులను రిజిస్టర్డ్ డాక్టర్ రాసిన తాజా ప్రిస్క్రిప్షన్ లేకుండా.. మెడికల్ షాపు వాళ్లు అమ్మకూడదు. అలాగే పేషెంట్లు కూడా డాక్టర్ సలహా లేకుండా వీటిని కొని వాడకూడదు. వ్యాధి తీవ్రతను అంచనా వేసి సరైన మందును సూచించే అధికారం డాక్టర్లకు మాత్రమే ఉంటుంది.
ఎర్రటి పట్టీ ఉండే మందులలో.. ఎక్కువ భాగం యాంటీ బయాటిక్స్ ఉంటాయి. అవసరం లేకపోయినా ..వీటిని వాడటం లేదా డాక్టర్ చెప్పిన కోర్సు పూర్తి చేయకుండా.. మధ్యలోనే ఆపేయడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులకు లొంగకుండా తయారవుతుంది. దీనినే.. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. భవిష్యత్తులో.. నిజంగా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సాధారణ మందులు పని చేయని పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రిస్క్రిప్షన్ మందుల డోసేజ్.. అనేది రోగి వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా డాక్టర్ నిర్ణయిస్తారు. ఒకరికి ..సరిపోయిన మందు మరొకరికి కిడ్నీ, లివర్ లేదా జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ..అవకాశం ఉంటుంది. అందుకే సొంత నిర్ణయాలతో.. లేదా ఇతరుల అనుభవాలతో వీటిని వాడటం అంత మందిచి కాదు.
మెడికల్ షాపులో.. మందులు తీసుకునేటప్పుడు గడువు తేదీతో.. పాటు స్ట్రిప్‌పై ఎర్రటి పట్టీ ఉందా లేదా అని గమనించండి. ఆ గుర్తు ఉంటే.. ఆ మందును మీ డాక్టర్ మీ కోసమే రాశారా లేదా అని సరి చూసుకోండి. పాత చీటీలతో.. లేదా ఇతరుల సలహాతో ఎర్రటి గీత ఉన్న మందులను ఎప్పుడూ వాడకండి. అలాగే డాక్టర్ సూచించినన్ని రోజులు పూర్తిగా కోర్సు వాడటం అలవాటు చేసుకోండి.
చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయెచ్చు. కాబట్టి ఇకపై మందులు కొనే ముందు ప్రతిసారీ ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు ఈ ఎర్రటి పట్టీని కూడా తప్పకుండా గమనించండి.