Sunscreen reactions: సన్ స్క్రీన్ చర్మాన్ని సూర్యకాంతి నుండి రక్షిస్తుంది. ఎక్కువ సమయం ఎండలో గడిపే వారు, సమ్మర్ వెకేషన్‌లో బీచ్‌కు వెళ్లేవారు తరచుగా సన్ స్క్రీన్ వాడతారు. చర్మం ట్యాన్ అవ్వకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాలు నేరుగా చర్మంపైన పడకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. అయితే, దీనిని అధికంగా వాడడం వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తవచ్చని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మ సమస్యలు
సన్ స్క్రీన్‌లో ఉండే కొన్ని కెమికల్స్ కారణంగా దీనిని అధికంగా వాడినప్పుడు చర్మం ఎరుపెక్కడం, దురద, మంట వంటి చర్మ సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సున్నితమైన చర్మం ఉన్నవారు దీని వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. కొన్ని రకాల సన్ స్క్రీన్‌లలో ఆక్సిబెంజోన్ వంటి పదార్ధాలు ఉంటాయట. ఇవి చర్మం లోతుకు చొచ్చుకుపోయి అలర్జీలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు .
హార్మోనల్ ఇంబాలన్స్
కొన్ని సన్ స్క్రీన్‌లలో ఉండే రసాయనాలు శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆక్సిబెంజోన్, ఒకటానోక్సేట్ వంటి పదార్ధాలు రక్తంలో కలిసి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయట. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలలో ఎక్కువ ప్రమాదం కలిగించవచ్చని అంటున్నారు. అధిక వినియోగం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
విటమిన్-డి లోపం
సూర్యకాంతి చర్మంలో విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడుతుంది. సన్ స్క్రీన్ వాడడం వల్ల సూర్యకిరణాలు చర్మానికి చేరుకోవని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల విటమిన్-డి లోపం ఏర్పడి ఎముకల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.
కొన్ని సన్ స్క్రీన్ లు చర్మంలోని సహజ నూనెలను తొలగించి చర్మం పొడిబారడం, మొటిమలు వంటివే కాకుండా అధిక వినియోగం వల్ల చర్మం రంగు మారడం, అసమానంగా మారడం వంటివి కూడా జరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పర్యావరణ ప్రభావం
సన్ స్క్రీన్‌లోని రసాయనాల వల్ల పర్యావరణానికే కాదు సముద్ర జీవులు, పగడాలు వంటి వాటికి నష్టం వాటిల్లుతుందట. అధికంగా సన్ స్క్రీన్ వాడడం వల్ల పర్యావరణ కాలుష్యానికి దారితీయవచ్చని అంటున్నారు.
జాగ్రత్తలు
సన్ స్క్రీన్ వాడకం అవసరమే, కానీ సరైన మోతాదులో అంటే SPF 30 లేదా 50 ఉన్నది వాడితే సరిపోతుంది. రోజుకు రెండు లేదా మూడుసార్లు తగినంత మొత్తంలో రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. సున్నిత చర్మం ఉన్నవారు కెమికల్స్ లేని సన్ స్క్రీన్‌లను ఎంచుకోవాలని అంటున్నారు. ఉదయం కొంత సమయం సూర్యకాంతిలో గడపడం వల్ల విటమిన్-డి లోపాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.